Saturday, November 23, 2024

దేశ ద్రోహ చట్టంపై వ్యతిరేక పిటిషన్లు..

- Advertisement -
- Advertisement -

Centre asks more time from SC to respond to petition

న్యూఢిల్లీ : బ్రిటిష్ వలస పాలకుల నాటి దేశ ద్రోహ చట్టాన్ని (సెడిషన్ లా) సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై తమ స్పందన తెలియజేసేందుకు కొంత గడువు కావాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. ఈ విషయమై మే 5 న తుది విచారణ మొదలవుతుందని, గత ఏప్రిల్ 27 న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. తుది విచారణను వాయిదా వేయాలని కోరే ఎలాంటి విజ్ఞప్తులను స్వీకరించబోమని, ఈలోగా తమ సమాధానం తెలియజేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అప్లికేషన్‌ను కోర్టుకు సమర్పించింది.

అఫిడవిట్ డ్రాఫ్ట్ రెడీ చేశామని, సంబంధిత అథారిటీ నుంచి ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నామని అందులో తెలిపింది. దేశద్రోహ చట్టం పలుమార్లు దుర్వినియోగం అవుతుండటంపై అత్యున్నత న్యాయస్థానం గత ఏడాది జులైలో ఆందోళన వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ , తిలక్ వంటి నేతల వాణిని, ఉద్యమాన్ని అణిచి వేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన చట్ట నిబంధనలను ఎందుకు రద్దు చేయరాదని కేంద్రాన్ని నిలదీసింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కూడా ఇంకా బ్రిటిష్ నాటి చట్టం అవసరం ఉందా ? అని ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్ 124 ఎ ( దేశద్రోహం) రాజ్యాంగ బద్ధతను ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ ఎన్‌జి వోంబట్కెరె తదితరులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి, పాత్రికేయులు కిషోర్ చంద్ర వాంఖ్కే మాచ్చా ( మణిపూర్) కన్హయ లాల్ శుక్లా (ఛత్తీస్‌గఢ్) తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News