బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు
పథకం అమలుకు రూ.29.98 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి పొందే వారి సంఖ్య 55,072
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు నేతన్న బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ పథకం అమలుకు వీలుగా ప్రభుత్వ చేనేత, వస్త్ర శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నది. పవర్‌లూమ్, యాన్సిలరీ, చేనేత కార్మికులు మరణిస్తే ఎల్‌ఐసి ద్వారా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించనున్నది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో వెల్లడించారు. చేనేతకు ప్రభుత్వం అండగా నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు. వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే యూనిఫామ్స్, బతుకమ్మ చీరలు తదితర వస్త్రాలను చేనేత, పవర్‌లూమ్ కార్మికులతో తయారు చేయించి చేతి నిండా పని కల్పిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నేత కార్మికులు ఈ రంగాన్ని నమ్ముకొన్నారు. వారందరికీ నేతన్న బీమాతో లబ్ధి చేకూరునున్నది.