Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా మోకాలి చిప్ప మార్పిడి

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృధా చేసుకోవద్దు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మోకాలి చిప్ప
మార్పిడి చికిత్సలను ప్రారంభించనున్నాం : సిద్దిపేట జిల్లా
ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారిని
పరామర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకే పరిమితమైన మోకాలి చిప్పల మార్పిడి చికిత్సలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రారంభించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న పుల్లూరుకు చెందిన యాదగిరి, సిద్దిపేటకు చెందిన బాపురెడ్డి, మందపల్లికి చెందిన యాదయ్యలను మంత్రి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇకపై సిద్దిపేట ఆస్పత్రిలో ప్రతివారం ఆరుగురికి మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేస్తారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. ధనవంతులు మాత్రమే చేయించుకునే ఇటువంటి ఆపరేషన్లను పేదలకు కూడా తమ ప్రభుత్వం అదుబాటులోకి తెచ్చి చూపిందన్నారు. రాష్ట్రం సిద్దించాక సిఎం కెసిఆర్ ఆలోచన విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు.

మోకాళ్ల నొప్పులతో ప్రతి పదిమందిలో ఇద్దరు బాధపడుతున్నారన్నారని, రెండు నెలల క్రితం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో జరిగిన క్యాంపులో 72మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇటీవల ముగ్గురికి మోకాళ్ల చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేశారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంవల్లనే ఈ సర్జరీలు సాధ్యమవుతున్నాయన్నారు. ఈ సర్జరీకి ప్రైవేట్ ఆసుపత్రులలో సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకోవడం వల్ల ఉచితంగా వైద్యాన్ని అందుకోవచ్చన్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై భయంపోయి ధైర్యం, నమ్మకం కలిగాయన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులను పరామర్శించి, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తమ్మిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సిద్దిపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరుసు, ఆర్‌ఎంఓ, డిఎంహెచ్‌ఓ కాశీనాథ్,హెచ్‌ఓడి కిషోర్, అసోసియేట్ ప్రొఫెసర్ వేణుగోపాల్, ఆర్థోపెడిక్ వైద్యులు వినయ్, అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ వడ్లకొండ సాయికుమార్, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News