Saturday, November 23, 2024

గుండె’కోత’నిఖీలు!

- Advertisement -
- Advertisement -

రైస్ మిల్లుల్లో ఫుడ్ కార్పొరేషన్ తనిఖీలు ఆపాలి

మా మీదేఎందుకీ కక్ష..ఎమిటీఈ వివక్ష..
రైతులు, మిల్లర్లను ఇబ్బందిపెట్టొదు
కొనుగోలు పూర్తయ్యాక ఫిజికల్ వెరైఫికేషన్ చేసుకోవచ్చు
ప్రతి గింజనూ ఎంఎస్‌పికే కొంటున్నాం
ధాన్యంపై సిఎం చిత్రపటం ఉంచి ఆభిమానం చాటిన రైతులు
రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ/కరీంనగర్ రూరల్: తనిఖీల పేరుతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రైతులు, మిల్లర్లను ఇబ్బందిపెట్టొదని, మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్‌ను పేరిట చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. రైస్ మిల్లుల్లో అక్రమాలంటూ ఎఫ్‌సిఐ జరుపుతున్న దాడులపై మంత్రి తీవ్రంగానే స్పందించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి, నాగుల మల్యాల, ఆసిఫ్‌నగర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ.. రాష్ట్రంపైనే ఎందుకీ కక్ష.. ఎమిటీ ఈ వివక్ష.. అంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఎఫ్‌సిఐ తనిఖీల వెనుక కేంద్రం ఉద్దేశ్యమేంటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సిఐ దాడులంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లుల్లో ఉద్దేశ్యపూర్వకంగానే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టారు, తెలంగాణ ప్రభుత్వంపై దాడిచేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని, కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోందని గంగుల విమర్శించారు.

ప్రతి గింజను కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొంటుందని, రైతుల పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని, డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం కుట్రపూరితంగా తనిఖీలు చేయిస్తోందన్నారు. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నామన్నారు. వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటంలేదని, కరెంట్, నీళ్లు, మౌళిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే సిఎం కెసిఆర్‌లాంటి వ్యక్తి అక్కడలేరనే అక్కసుతో కళ్ల మంటలతో మన రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలబడాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు కావాల్సిన సాగుకు పెట్టుబడికోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీరు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందన్నారు.

ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ యాసంగిలో అవరమైన గన్నీబాగులు 15కోట్లుగా అంచనా వేయగా అందులో కోటి 62 లక్షల 70వేల 611 గన్నీ బ్యాగులు ప్రారంభం నుంచి అందుబాటు ఉంచామన్నారు. మరో 7కోట్ల 67లక్షల గన్నీ బ్యాగులు సిద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6812 కొనుగోలు కేంద్రాలకుగానూ.. ఇప్పటికే 3381కేంద్రాలను ప్రారంభించామని, 49,875 రైతులను నుంచి 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసామని మంత్రి కమలాకర్ తెలిపారు. అందులో 3.54లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 249 కొనుగోలు కేంద్రాలు కేంద్రాల ద్వారా 8,600 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. చల్లగున్న రైతన్నను చూసి ఓర్వలేని కేంద్రలోని బిజెపి మోకాలడ్డుతూ కొనాల్సిన బాధ్యతలనుంచి చేతులెత్తేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేకపోతే గతంలో మాదిరి రైతు ఆత్మహత్యలకు దారితీసేదన్నారు. కాగా, నాగుల మల్యాల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసిపై సిఎం కెసిఆర్ చిత్రపటం ఉంచి తమ ఆభిమానం చాటున్నారు.

కార్యక్రమంలో ఎంపిపి శ్రీలతమహేష్, జడ్పిటిసీ కరుణరవిందర్, పిఎసిఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, పిఎస్‌సిఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ డిఎం శ్రీకాంత్ రెడ్డి, ఆర్‌డివో ఆనంద్‌కుమార్, డిఆర్‌డిఎ శ్రీలత, ఎంపిడివో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు మధు, శాంతశ్రీనివాస్, ఎంపిటిసి కమల మనోహర్, ఉప్పు రాజశేఖర్, శ్రీనివాస్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News