రాజకీయ పరిస్థితులపై రాష్ట్రాల నేతలతో భేటీ
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాలలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు ఈనెల 20, 21 తేదీలలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో బిజెపి సమావేశం కానున్నది. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బిజెపి సంస్థాగత ముఖ్య నాయకులు పాల్గొంటారని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగిస్తారని వారు చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. 2020 ప్రారంభంలో కొవిడ్ రాక తర్వాత పార్టీ నాయకులందరూ వర్చువల్‌గా అప్పుడప్పుడు సమావేశం అవుతున్నప్పటికీ ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో సమావేశం కావడం మాత్రం ఇదే మొదటిసారి. మే 20న జాతీయ కార్యవర్గం, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు సమావేశం అవుతారని, మరుసటి రోజున పార్టీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విడిగి సమావేశమవుతారని వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ చేపట్టిన కారకలాపాలపై ఒక నివేదిక తీసుకురావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కోరారు.