మరియుపోల్ థియేటర్ మారణకాండపై ఆలస్యంగా వెలుగుచూస్తున్న వాస్తవాలు
ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా ఎపి వార్తాసంస్థ ఇన్వెస్టిగేషన్
లెవివ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధంలో అత్యంత విషాదకరమైన, అతి పెద్ద ఘటనగా మరియుపోల్‌లోని డొనెట్స్ డ్రామా థియేటర్‌పై జరిగిన దాడి మిగిలిపోనుంది. గత మార్చి 16న జరిగిన ఈ విషాదకర ఘటనలో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ ఓ అంతులేని రహస్యంగానే మిగిలి పోయింది. ఈ థియేటర్‌లో దాదాపు వెయ్యి మందికి పైగా పౌరులు తలదాచుకొంటున్నట్లు అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. అత్యంత విశాలమైన మూడంతస్థుల ఈ థియేటర్ రష్యా జరిపే దాడులనుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి మరియుపోల్ పౌరులకు ఓ సురక్షితమైనషెల్టర్‌గా ఉండేది. అయితే రష్యా జరిపిన బాంబు దాడిలో ఈ థియేటర్ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. శిధిలాల కింద అనేక మంది చిక్కుకు పోయి ప్రాణాలు కోల్పోయారు. నిరంతరాయంగా కొనసాగుతున్న రష్యా దాడుల కారణంగా కనీసం శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసే అవకాశం కూడా లేకపోయింది. మొదట్లో మృతులను పదుల సంఖ్యగా అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత అది వందల్లోకి చేరుకుంది. దాదాపు 300 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అప్పట్లో చెప్పారు.
అయితే ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన 23 మంది ప్రత్యక్ష సాక్షు కథనాల ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తాసంస్థ జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో ఈ దాడి ఊహించినదానికన్నా విధ్వంసాన్ని సృష్టించిందని, భవనం లోపల, వెలుపల కలిసి 600 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయి ఉంటారని నిర్ధారణ అయింది. అంటే ఇప్పటివరకు అంచనా వేసిన దానికన్నా రెండింతల ప్రాణ నష్టం జరిగిందన్న మాట. ప్రాణాలతో బైటపడిన వారంతా ఈ థియేటర్ గురించి అణువణువూ బాగా తెలిసి వారే. వారు చెప్పిన విషయాలు, థియేటర్ ప్లాన్లు, థియేటర్ లోపల తీసిన ఫొటోలు, వీడియోలు, నిపుణులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎపి వార్తాసంస్థ దాడి జరిగిన రోజు థియేటర్‌లోపల జరిగిన విధంసాన్ని పునః సృష్టి చేసింది. భవనానికి సంబంధించి 3డి మోడల్‌ను రూపొందించింది. ఇంత చేసినప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోవడం, నిరంతరం జనం వచ్చి పోతుండడం, బాధ వల్ల ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు పూర్తిగా గుర్తు లేకపోవడం లాంటి కారణాల వల్ల కచ్చితంగా మృతుల సంఖ్యను నిర్ధారించడం అసాధ్యంగా మారింది.
అయితే ఉక్రెయిన్ బలగాలే ఈ థియేటర్‌ను నేలమట్టం చేశాయని,లేదా ఈ థియేటర్ ఉక్రెయిన్ సైనికులకు షెల్టర్‌గా ఉపయోగపడేదని రష్యా చేస్తున్న వాదనలు నిజం కాదని ఎపి వార్తాసంస్థ దర్యాప్తు స్పష్టం చేస్తోంది. భవనం లోపల ఉక్రెయిన్ సైనికుల కదలికలను ప్రత్యక్ష సాక్షుల్లో ఎవరు కూడా చూడలేదు.పెద్ద సంఖ్యలో చిన్నారులు ఉండే, పౌరులు తలదాచుకున్న ఈ భవనాన్ని కచ్చితమైన టార్గెట్‌గా చేసుకుని ధ్వంసం చేసిందనే విషయంలో ఏ ఒక్కరికీ అనుమానం లేదు కూడా. మార్చి మొదటి వారంలో రష్యా మరియుపోల్ నగరాన్ని చుట్టుముట్టింది. ఆ వెంటనే నగర అధికారులు ఈ థియేటర్‌ను బాంబు షెల్టర్‌గా తెరవాలని ఆదేశించారు. బాంబు దాడి జరగడానికి వారం రోజుల ముందు దీనిపై దాడి చేయకుండా ఉంటారన్న ఆశతో దాని ముందు, వెనుక భాగాల్లో వైట్‌పెయింట్‌తో ‘చిల్డ్రన్’ అని పెద్ద అక్షరాలు రాశారు కూడా. మార్చి 9వ తేదీన ఈ థియేటర్‌కు దగ్గర్లో ఉన్న ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా బాంబుదాడి జరిగింది.
దీంతో అక్కడినుంచి ఇద్దరు ముగ్గురు గర్భిణీలను సేఫ్టీ కోసం ఈ థియేటర్‌లోకి తరలించారు. మరో వారం రోజులకల్లా 1200 మందికి పైగా ఈ భవనంలోకి వచ్చి చేరారు. బేస్‌మెంట్‌తో పాటుగా ఆఫీసులు, కారిడార్లు, బాల్కనీలు..ఇలా ఎక్కడ చూసినా నిద్రపోయే జనమే ఉండేవారు. అంతేకాదు రెడ్‌క్రాస్ అందించే ఆహారం, తాగు నీటికి, అలాగే నగరంనుంచి పౌరుల సురక్షిత తరలింపు వార్తలకు ఈ భవనం కేంద్రంగా మారింది. అయితే రష్యా దాడి తర్వాత పరిస్థితి అంతా మారి పోయింది. ఇప్పుడు థియేటర్ అంతా శిథిలాల కింద కప్పడిపోయింది. మిగిలిఉన్న మొండి గోడలు కూడా పొగతో నల్లగా మసిబారిపోయి ఉన్నాయి. అయితే శిథిలా ల గుట్టల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు మిగిలి ఉన్నాయనేది భేతాళ ప్రశ్నగా మిగిలింది.
శిథిలాల కింద మృత దేహాలు ఏవీ లేవని రష్యా అధికార మీడియా తీసిన వీడియోలో కనిపిస్తోంది. అయితే మృతదేహాలు శిథిలాల కింద మట్టిలో కలిసి పోయైనా ఉండాలి, లేదా రష్యా సైనికులు వాటిని మాయం చేసైనా ఉండాలనేది ప్రత్యక్ష సాక్షుల అనుమానం. దాడి జరగడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఫోటోలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఈ విషయంలో అత్యంత కీలకం కానున్నాయని 2006నుంచి 2009 మధ్యకాలంలో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి అమెరికా రాయబారిగా పని చేసిన క్లింట్ విలియమ్సన్ అంటున్నారు. అయితే రష్యా జరిపిన మారణకాండ చేదు జ్ఞాపకాలు ప్రాణాలతో మిగిలి ఉన్న వారిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ‘ వారు నగరాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం రాలేదు.. నగరాన్ని నాశనం చేయడానికి వచ్చారు’ అని లెవివ్ నగరంలోని మరో ఆడిటోరియంలో తలదాచుకుని ఉన్న మారియాకుత్నియాకోవా చెప్తున్న మాటలు రష్యన్లు మరియుపోల్‌లో సృష్టించిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడ్తాయి.