హైదరాబాద్: యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. యూసుఫ్‌గూడ 1వ టిఎస్‌ఎస్‌పి బెటాలియన్ గ్రౌండ్‌లో శనివారం ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తప్పనిసరిగా నిర్వాహకులు జారీ చేసిన పాసులు కలిగి ఉండాలని, దానిపై హోలో గ్రాం, సీరియల్ నంబర్ ఉండాలని స్పష్టం చేశారు.
పాసులు లేని వారిని లోపలికి అనుమతి ఇవ్వమని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. మైత్రీవనం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలను యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు అనుమతించబడవు. సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్‌నగర్ వైపు, సత్యసాయి నిగమాగమం, కమలాపురి కాలనీ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తారు. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వైపు అనుమతించబడవు. శ్రీనగర్ కాలనీ వద్ద సత్యసాయి నిగమాగమం వైపు వాహనాలు మళ్లిస్తారు.
పార్కింగ్ ప్రాంతాలు….
మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్ కార్ పార్కింగ్ కోసం 70 వాహనాలను అనుమతిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్‌లో ఫోర్ వీలర్లు, టూవీలర్లు పార్కింగ్ చేయాలి, ఇక్కడ 200 కార్లు, 700 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాలి. ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూలో టూవీలర్ పార్కింగ్ కోసం 200 వాహనాలను అనుమతిస్తారు. యూసుఫ్‌గూడ మెట్రోస్టేషన్ పార్కింగ్ టూవీలర్ల పార్కింగ్ కోసం 500 దిచక్ర వాహనాలను అనుమతిస్తారు.