సహాయక దళాలు సర్వం సన్నద్ధం
భువనేశ్వర్ : ఒడిషా తీరానికి అసానీ తుపాన్ ముప్పు ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ ఘటనలను అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 175 సహాయక దళాలను సర్వం సన్నద్ధం చేసింది. అధికారులు అంతా సెలవులు ఉపసంహరించుకుని విధులలో ఉండాలని శనివారం ఉన్నత స్థాయిలో ఆదేశాలు వెలువరించారు. దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. తరువాత ఇది క్రమేపీ తుపాన్‌గా రూపాంతరం చెందింది. ఈ సైక్లోన్‌ను అసానీ అని వ్యవహరిస్తున్నారు. తుపాన్ ధాటికి దక్షిణాది తీర ప్రాంత జిల్లాలకు ముప్పు ఏర్పడనుందని రాష్ట్ర ఫైర్‌సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంతోష్ కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. 10వ తేదీ నాటికి ఇది తీరం తాకుతుందని వివరించారు. ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.