50 మంది పౌరుల అప్పగింత
జపోరిజ్‌జియా (ఉక్రెయిన్) : రష్యా సైన్యం దిగ్బంధనంలోని మేరియూపోల్ స్టీల్ ప్లాంట్ నుంచి మరో 50 మందిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. రష్యా బలగాల దాడుల భయాలు , ఎటు నుంచి ఏ విమాన బాంబులు మీదపడుతాయో తెలియని స్థితిలో ఇంతకాలం పౌరులు ఇక్కడ గడిపారు. అయితే తాము ఇప్పుడు మరో 50 మందిని అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు తీసుకువచ్చామని వీరిని అక్కడి ఐరాస , రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించామని రష్యా సైనిక వర్గాలు శనివారం తెలిపాయి. ఇప్పుడు బయటకు తీసుకువచ్చిన పౌరులలో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి పౌరులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన అంశాన్ని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇర్యన వెరెస్చుచుక్ కూడా నిర్థారించారు. మేరియూపోల్ అత్యంత కీలకం, వ్యూహాత్మక రేవు పట్టణం కావడంతో దీనిని పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేందుకు రష్యాబలగాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రాంతం దాదాపుగా అంతా కూడా రష్యా సైనికుల అధీనంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి కంచుకోట వంటి దుర్భేధ్యపు స్టీల్ ప్లాంట్ ఆవరణనే తమ సైనిక కేంద్రంగా మల్చుకుని ఉక్రెయిన్ సేనలు ఇక్కడి బంకర్లలో తిష్టవేసుకుని రష్యాఅధీనంలోకి మేరియూపోల్ చేరలేదని ప్రకటించుకుంటున్నాయి.