Monday, December 23, 2024

ప్రతి నగరంలో ఓ వాహన తుక్కు కేంద్రం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Vehicle scrapping facilities each city centres

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఒక వాహన తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తన లక్షమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి వాహన తుక్కు కేంద్రంగా తయారవ్వగల సామర్థం మన దేశానికి ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ… కేంద్రం తీసుకువచ్చిన కొత్త వాహన తుక్కు విధానం భారత రవాణా వ్యవస్థలోనే అత్యంత కీలక పరిణామమని చెప్పారు. దీనితో కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలు దశలవారీగా వ్యవస్థనుంచి తొలగిపోతాయని వివరించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎలాంటి మదుపరులైనా తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కొత్త విధానాన్ని రూపొందించామన్నారు. ప్రధాన తుక్కు కేంద్రాల అభివృద్ధితో పాటు పట్టణాల్లో చిన్నచిన్న అధీకృత సమీకరణ యూనిట్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. వాటికి వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసి డిపాజిట్ చేసుకున్నట్లుగా ధ్రువపత్రం కూడా జారీ చేసే అధికారం ఉంటుందన్నారు.

మరోవైపు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలనుంచి తుక్కు వాహనాలను సేకరించి రీసైక్లింగ్ చేసే అవకాశం భారత్‌కు ఉందని తెలిపారు. మెటల్ రీసైక్లింగ్‌లో అగ్రగామిగా ఉన్న సంస్థలు ఆదర్శ జిల్లాల్లోనూ తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గడ్కరీ కోరారు. వాహనాల రీసైక్లింగ్ కోసం తీసుకురాబోతున్న సాంకేతికత ఈ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుందని ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పన సైతం పెరగనుందని వివరించారు. స్వచ్ఛంద వాహన తుక్కు విధానం కింద 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధనసామర్థం మెరుగుపడడంతో పాటుగా పర్యావరణ హిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుంది. వాహన తుక్కు విధానం కింద పాత వాహనం ఇస్తే కొత్తదానిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రోడ్డు టాక్స్‌పై 20 శాతం రిబేటు ఇస్తాయి. ఈ కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలులలోకి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News