ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మోడీ ప్రభుత్వం భారీగా పెంచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తమ హయాంలో కంటే ప్రస్తుత బిజెపి పాలనలో ఇంధన ధరలు రెండింతలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్ వంటగ్యాస్ ధరకు 2014 లో రెండు సిలిండర్లు వచ్చేవని గుర్తు చేస్తూ మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2014 లో ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.410 ఉండగా, సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ అందించాం. కానీ ప్రస్తుతం బిజెపి హయాంలో ఎల్‌పీజీ ధర రూ.999 కు చేరింది. సబ్సిడీ మాత్రం సున్నా ’ అని పోల్చుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసంకృషి చేస్తుందన్న ఆయన .. అదే మన ఆర్థిక వ్యవస్థ విధానంలో అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు.