రానున్న మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు
హైదరాబాద్: ‘అసని తుఫాను’ ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అసని తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావం ఎపితో పాటు తెలంగాణలోనూ ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.