మనతెలంగాణ/ హైదరాబాద్: రాజ్యాధికారం కోసం బిసిలు సంఘటితంగా ముందుకుసాగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బిసిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తపేట్‌కు చెందిన దేవనక దేవేందర్‌ను జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామకపత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ బిసి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. బిసిలు సంఘటితంగా ఉండాలని, రాజ్యాదికారం కోసం పోరాడాలన్నారు.
బిసి డిమాండ్ల కోసం కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు త్వరలో కర్ణాటక లో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తామన్నారు. తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. దేవనక దేవేందర్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ బిసి సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్, బిసి ప్రజా సమితి రాష్ట్ర అద్యక్షులు రేగుల మధుసూదనరావు, అడ్వకేట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్‌యాదవ్, బాలయ్య, జగదీశ్‌యాదవ్, శ్రీహరి, శ్రీదేవి పాల్గొన్నారు.