Saturday, November 23, 2024

శ్రీలంకలో ప్రజాతిరుగుబాటు!

- Advertisement -
- Advertisement -

PM Modi says Committee on repeal of Sedition Law

పాలకుల తప్పుడు ఆర్థిక విధానాల గద్ద కాళ్లకు చిక్కుకున్న కోడి పిల్లల్లా విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రజలు దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గోటాబయ సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి ముందు సోమవారం నాడు తన అధికార నివాసం బయటి శిబిరాల్లోని శాంతియుత నిరసన ప్రదర్శకులపైకి గూండాలను ఉసిగొల్పి గత కొంత కాలంగా రగులుతున్న అశాంతికి పరాకాష్ఠను చవిచూశారు. మహింద రాజీనామా చేస్తారని ఇటీవల అనుకొంటూ వచ్చారు. కాని ఆయన అందుకు తొందరపడకుండా పదవిని పట్టుకొని వేలాడారు. ప్రజలు ఆగ్రహోదగ్రులై విరుచుకుపడడంతో చివరికి మహింద మంత్రివర్గం తప్పుకోక తప్పలేదు. మహింద ఇప్పుడు సురక్షిత ప్రాంతంలో తలదాచుకొంటున్నారని వార్తలు చెబుతున్నాయి.

గోటాబయను కూడా అధ్యక్ష పదవి నుంచి తరిమివేసేంత వరకు విశ్రమించకూడదని ప్రజలు నిర్ణయించుకున్నట్టు స్పష్టపడుతున్నది. దేశమంతటా కర్ఫూ విధింపు ద్వారా సోమవారం నాటి తిరుగుబాటుకు గోటాబయ బ్రేకులు వేయగలిగారు. అది ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదు. అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటిస్తున్నారు. కాని ఆచరణలో ఆయన అందుకు సిద్ధంగా లేరని అనుకోవలసి వస్తున్నది. మూలంలో వున్న ఆర్థిక సంక్షోభాన్ని ఏ విధంగా పరిష్కరించగలుగుతారనేదే సంక్షోభానికి శాశ్వతంగా తెర దించగలుగుతుంది. సోమవారం నాడు పలువురు అధికార పక్ష పార్లమెంటు సభ్యుల ఇళ్లకూ ప్రజలు నిప్పంటించారు. అల్లర్లలో ఒక పాలక పక్ష ఎంపి సహా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. దక్షిణ హంబన్‌తోట జిల్లా లోని రాజపక్స వంశీయుల స్మృతి చిహ్నాన్ని, వారి తాతలు ముత్తాతల నాటి పురాతన భవనాన్ని కూల్చివేశారు. మహింద రాజపక్సను ఎంతగానో ఆరాధించి, ప్రేమించి ఒకటికి రెండు సార్లు అధికార అందలమెక్కించిన శ్రీలంక ప్రజలు ఇప్పుడు ఆయనను అంత తీవ్రంగా ద్వేషిస్తున్నారని రుజువవుతున్నది.

శ్రీలంక కూరుకుపోయిన ఆర్థిక సంక్షోభం కేవలం అక్కడి పాలకుల స్వయం కృతాపరాధమే. జనజీవనం సాఫీగా సాగడానికి విదేశీ మారక (డాలర్ కరెన్సీ) ద్రవ్యంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థల్లో సంభవించడానికి అరుదుగానైనా అవకాశముండే ఈ సంక్షోభాన్ని శ్రీలంక పాలకులు చేజేతులా ఆహ్వానించారు. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరుల్లో చెప్పుకోదగినది విహార యాత్రారంగం. కొవిడ్ కారణంగా ఈ రంగంలో రాబడి తీవ్రంగా దెబ్బతిన్నది. అదే సమయంలో విదేశాల్లోని లంక పౌరుల నుంచి చెల్లింపులు కూడా తగ్గిపోయాయి. ఈ స్థితిలో ఎంతో జాగ్రత్తగా, వొళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించవలసిన రాజపక్సల ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అడుగులు వేసింది. 2019 ఎన్నికల్లో ప్రజల ఓటును ఆకట్టుకోడానికి పన్నుల్లో విశేష రాయితీలను వాగ్దానం చేసిన రాజపక్సలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తగ్గించిన ఫలితంగానే ప్రభుత్వ రాబడిలో కోత భారీగా పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో విచ్చలవిడిగా విదేశీ అప్పులు చేసి వాటి మీద వడ్డీ చెల్లింపుల భారాన్ని మితిమించి పెంచుకున్నారు. రాబడి అంతా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులకే చాలని దుస్థితి తలెత్తడంతో ప్రజలకు అత్యవసరమైన పెట్రోల్, డీజెల్, ఆహారం, మందులు వంటి వాటిని దిగుమతి చేసుకోలేని దారిద్య్రం దేశాన్ని ఆవహించింది. దానితో అవి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయి ప్రజల మూలుగులను పిప్పి చేయడం ప్రారంభించాయి. ధరలు ఊహించనంతగా పెరిగిపోయాయి. విద్యుత్ కోతలు మితిమించిపోయాయి.

రెండేళ్లలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 70 శాతం తగ్గిపోయాయి. పులిమీద బుట్రలా ప్రభుత్వం విశేషంగా ప్రోత్సహించిన సేంద్రియ వ్యవసాయ విధానం వల్ల దేశావసరాలకు తగినంతగా ఆహార ఉత్పత్తి జరగకుండా పోయింది. దిగుమతి చేసుకోడానికి తగినన్ని డాలర్ నిల్వలు లేకపోడం పసి పిల్లలకు పాలు కూడా కరువయ్యే దారుణ దుస్థితిని దాపురింప చేసింది. విదేశీ మారక నిల్వల కొరత కారణంగానే రసాయన ఎరువుల, పురుగు మందుల దిగుమతికి ప్రభుత్వం స్వస్తి చెప్పిందనే అభిప్రాయమూ వుంది. దానిని కప్పి పెట్టుకోడానికి సేంద్రియ వ్యవసాయ నీతులను ప్రచారంలో పెట్టిందని భావిస్తున్నారు. విదేశీ అప్పులపై వడ్డీ చెల్లింపులే దేశంలో పలు రకాల కొరతలకు కారణమని భావించిన ప్రభుత్వం వున్నట్టుండి చేతులెత్తేసింది. డాలర్ బకాయిలను తీర్చబోమని చెప్పి దివాలా ప్రకటించింది. దానితో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆదుకోడానికి ముందుకు రావడం మానుకుంది. ఒకవైపు ఐఎంఎఫ్ నిబంధనల మేరకు దేశంలో రాయితీలను నిలిపివేయక తప్పనూ లేదు. మరోవైపు దాని నుంచి అప్పు కూడా పుట్టడం మానుకున్నది. ఈ కల్లోల పరిస్థితి నుంచి శ్రీలంక ఏ విధంగా బయటపడుతుందనేది కీలకమైన ప్రశ్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News