గాంధీ కుటుంబానికి మాత్రం మినహాయింపు
చింతన్ శిబిర్‌లో ప్రధాన చర్చ ఇదే
పార్టీ పార్లమెంటరీ బోర్డు పునరుద్ధరణ
యువతకు 50 శాతం పార్టీ పదవులపైనా నిర్ణయాలు
రేపటినుంచి ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’
న్యూఢిల్లీ: ‘ ఒక ఫ్యామిలీ ఒక టికెట్ ’అంశంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బుధవారంనుంచి మూడు రోజుల పాటు సాగే పార్టీ చింతన్ శిబిర్‌లో నూ దీనిపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. చింతన్ శిబిర్ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశంలో చర్చించిన అంశాల్లో ఇదొకటని వినికిడి. అయితే గాంధీ కుటుంబానికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పరాజయాల పరంపరనుంచి విజయాల దిశగా పార్టీని మళ్లించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ శిబిరంలో ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. అందులో భాగంగా సమష్టి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా పార్టీ పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిపై పోరుకు అన్ని విపక్షాలతో పొత్తుకు చింతన్ శిబిర్ పిలుపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే పెరిగిపోతున్న జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగంపై దృష్టిపెట్టడంతో పాటుగా ఇటీవలి ఎన్నికల్లో మాదిరిగా విభజనపూరిత, మతతత్వ ప్రచారోద్యమాన్ని అనుమతించ రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా పార్టీ నేతలు, కార్యకర్తల కోసం ఒక శిక్షణా సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈ చింతన్ శిబిర్‌లో పరిశీలిస్తారని ఆ నేత చెప్పారు. పార్టీలోకి 50 ఏళ్లకన్నా తక్కువ వయసు నేతలను చేర్చుకోవడంపైన, వారికోసం పార్టీ పదవుల్లో 50 శాతం పదవులను కేటాయించే అంశంపైన కూడా ఈ శిబిర్‌లో చర్చిస్తారని పార్టీ నేతలు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, చింతన్ శిబిర్‌లో వీటిపై విస్తృతంగా చర్చిస్తారని కూడా ఆ నేతలు చెప్పారు.