Monday, December 23, 2024

రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

Supreme Court stays proceedings in sedition cases

సమీక్షపూర్తయ్యే వరకు కొత్త కేసులు నమోదు చేయరాదని సూచన

న్యూఢిల్లీ : వలస పాలకుల నాటి రాజద్రోహం (సెక్షన్ 124 ఎ) చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా ఈ చట్టం అమలుపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. కేంద్రం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు ఈ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. సమీక్ష పూర్తయ్యేవరకు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు కదా అని సూచించింది.

దీనిపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం కోర్టుకు వివరణ ఇచ్చారు. సమీక్ష పూర్తయ్యేవరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా నిలిపివేయడం సరైన విధానం కాదని వాదించారు. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమన్నారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని, కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చని, లేదా మనీ లాండరింగ్ కేసులైనా కావొచ్చని చెప్పారు. అయితే ఈ కేసులను పరిశీలించడానికి ఓ ఆఫీసర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, ఎస్పీ ర్యాంక్ అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తేనే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని అనుకుంటున్నామని తెలిపారు. పెండింగ్ కేసులను న్యాయపరమైన ఫోరమ్ ముందు పరిశీలించాలని తుషార్ మెహతా వివరించారు. అయితే కేంద్రం వాదనతో చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని సీజేఐ రమణ అభిప్రాయపడ్డారు.

“ ఈ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకూ రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. అందువల్ల పునఃపరిశీలన పూర్తయ్యేంతవరకు దీని అమలుపై స్టే విధిస్తున్నాం. అప్పటిదాకా ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని విశ్వసిస్తున్నాం. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చు.” అని సీజేఐ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిలు కోసం న్యాయస్థానాలకు వెళ్ల వచ్చని సీజేఐ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News