రాష్ట్రవ్యాప్తంగా చల్లబడిన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్: ‘అసని’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోనూ బుధవారం వానలు కురిశాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో రాష్ట్ర ప్రజలకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయ్యింది. బుధవారం తెల్లవారుజాము నుంచే పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా నగరంలోని హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో వాన కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నేడు, రేపు పలు జిల్లాలో భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో వాసలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
బలహీనపడిన ‘అసని’
ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అసని’ తుఫాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీల దూరంలో నర్సాపురానికి 30కి. మీ. దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న ఈ అసని తుఫాను నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగంపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6కి. మీ. వేగంతో కదులుతున్నట్టు తెలిపింది. భూభాగంపైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుఫాను ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని తెలిపింది. తీవ్ర తుఫాను కారణంగా విశాఖ నుంచి నడిచే పలువిమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.