Monday, December 23, 2024

బంగారం పెరగొచ్చు

- Advertisement -
- Advertisement -

ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు ఆందోళనలే కారణం
పసిడిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు
డిమాండ్ వల్ల ధర పెరగనుందంటున్న నిపుణులు
రెండేళ్ల గరిష్ఠానికి ఇటిఎఫ్‌లోకి నిధుల ప్రవాహం

The price of 10 grams of gold crossed Rs 54,000
న్యూఢిల్లీ : భారతదేశంలో వృద్ధి రేటుపై ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారమే సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారంలో పెట్టుబడితో ఇన్వెస్టర్లకు 7 శాతం రాబడిని వచ్చింది. అయితే ఈ విలువైన లోహం ధరలు చాలా సార్లు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ట్రెండ్ నేపథ్యంలో పెట్టుబడిదారులకు బంగారం లాభదాయకంగా కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ నెలలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లోకి నిధులు రూ.1,100 కోట్లు రాగా, 2020 ఫిబ్రవరి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే ఐదు కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి పెరిగింది. ఇక బ్రిటన్, అమెరికాతో సహా అనేక దేశాలలో ఇది నాలుగు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది. స్వల్పకాలిక ఒడిదుడుకులను మినహాయించి, ద్రవ్యోల్బణం పెరిగే కాలంలో బంగారం ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారం మంచి పెట్టుబడి ఎంపికగా పరిగణించబడడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న కాలంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
వడ్డీ రేటు పెంపు
ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ఇటీవల రెపో రేటును 0.40 శాతం పెంచింది. దీంతో మొత్తంగా రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో యుఎస్ ఫెడ్ రెపో రేటును 0.50 శాతానికి పెంచింది. ఇది కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ వడ్డీరేట్లను పెంచాయి. రేట్ల పెంపుతో రుణాలు ఖరీదవుతున్నాయని, దీంతో పరిశ్రమతో పాటు సామాన్యులు కూడా అప్పులు చేసి వ్యాపారాన్ని విస్తరించుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
బలపడిన డాలర్
అంతర్జాతీయంగా బంగారం ధర డాలర్లలో నిర్ణయిస్తారు. అధిక ముడి చమురు ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా పెట్టుబడిదారులు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దీంతో డాలర్‌కు డిమాండ్‌ను పెరిగింది. డాలర్ బలపడటం వల్ల బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
సప్లై చైన్‌కు అంతరాయం
చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్‌కు అంతరాయం కలిగిస్తోంది. ఇది ఆటో పరిశ్రమ నుండి వినియోగదారు డ్యూరబుల్స్‌తో సహా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. దీంతో ప్రపంచ స్థాయిలో ఆర్థిక మందగమనం భయం మళ్లీ పెరిగింది. ఈ పరిస్థితిలో కూడా బంగారం ధర మరింత పెరిగేందుకు అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News