మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి సముద్ర తీరంలో ఓ స్వర్ణ రథం కొట్టుకొచ్చింది. సముద్ర తీరంలో స్వర్ణ రథం వచ్చిందన్న విషయం తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తాళ్లతో స్వర్ణరథాన్ని లాగి ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో మెరిపోతున్న ఈ రథం ఊరేగింపులలో ఉపయోగిస్తారని అధికారులు గుర్తించారు. బంగారు వర్ణంతో ధగధగలాడుతూ ఉండటంతో దీన్ని చూసేందుకు జనాలు తరలిరావడంతో సముద్ర తీరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీన్ని కుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇది మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మయన్మార్‌లో ఎవరైనా యువతీయువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే సమయంలో ఈ తరహా రథాలలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారని, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం కూడా ఇలాగే కనిపిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారని, ఈ వాహనంపై జనవరి 16, 2022 అనే తేదీ కూడా కనిపిస్తోందని తెలిపారు. నాలుగు నెలల క్రితమే ఈ రథాన్ని రూపొందించి ఉంటారని, రథం రూపురేఖలు డిజైన్స్ అంతా కూడా బౌద్ధమతం థీమ్ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.