న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. జూన్ 10 న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… ఆంధ్ర ప్రదేశ్‌లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అత్యధికంగా 11 సీట్లలో ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఆరేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనాచౌదరి, విజయసాయిరెడ్డి పదవీకాలం జూన్ 21 తో ముగియనుండగా, తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం జూన్ 29 తో ముగియనున్నది. అలాగే , చత్తీస్‌గఢ్‌లో 2 స్థానాలు, మధ్యప్రదేశ్ 3, తమిళనాడు 6, కర్ణాటక 4, ఒడిశా 3, మహారాష్ట్ర 6, పంజాబ్ 2, రాజస్థాన్ 4, ఉత్తరప్రదేశ్ 11, ఉత్తరాఖండ్ 1, బీహార్ 5, హర్యానా 2, ఝార్ఖండ్ 2 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలివే…
నోటిఫికేషన్ జారీ : మే 24
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : మే 31
నామినేషన్ల పరిశీలన : జూన్ 1
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు : జూన్ 3
ఎన్నికల తేదీ : జూన్ 10
ఎన్నికలు జరిగే సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు : జూన్ 10 (సాయంత్రం 5 గంటల నుంచి)