కెటిఆర్ వల్లే 27మంది ఇంటర్ విద్యార్థులు మరణించారని సంగ్రామ యాత్రలో బూటకపు ఆరోపణ
రుజువు చేయకపోతే చట్టపరమైన చర్యలు: ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
ఆధారాలుంటే వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి
లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి
హాస్యాస్పద, బాధ్యతా రహిత ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : కెటిఆర్
భర్త చనిపోతే బిజెపి నాయకులపై విరుచుకుపడిన ఆ పార్టీ కార్యకర్త భార్య
రైతు బీమా ద్వారా కెసిఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని బండి పాదయాత్రలో ఓ మహిళ
హైదరాబాద్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై తెలంగాణ మంత్రి కెటిఆర్ సీరియస్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలను కూడా కెటిఆర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. తెలంగాణలో కెటిఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్థులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్షం వల్ల విద్యార్థులు చనిపోతే టిఆర్‌ఎస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి తాను కారణమనే విషయమై బండి సంజయ్ ఆధారాలు చూపాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకొంటానని కూడా కెటిఆర్ హెచ్చరిచారు. హాస్యాస్పద, ఆధారరహిత, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కెటిఆర్ హెచ్చరించారు.
ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కూడా బండి సంజయ్‌ను కెటిఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా కెటిఆర్ డిమాండ్ చేశారు. కాగా, బిజెపి పార్టీ నేతలు వారి పార్టీ కార్యకర్తలనే సరిగ్గా చూసుకోని వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఇటీవల ఓ బిజెపి కార్యకర్త మరణించగా, అతని భార్య బండి సంజయ్‌ని నిలదీసింది. ‘ నా భర్తకు బిజెపి అంటే ప్రాణం.. నా భర్త చనిపోయినప్పుడు బిజెపి నాయకులు ఎవరూ మా కుటుంబాన్ని ఓదార్చలేదు. సహాయం చేయలేదు.. కానీ కెసిఆర్ రూ.5 లక్షల రైతు బీమాతో మాకు సహాయం చేశార’ని ఇటీవల బండి సంజయ్ పాదయాత్రలో సదరు మహిళ ఆయనను నిలదీసింది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను మంత్రి కెటిఆర్ షేర్ చేశారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. టిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదు అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.