Monday, December 23, 2024

టైప్ 2 డయాబెటిస్ జన్యురహస్యం బట్టబయలు

- Advertisement -
- Advertisement -

Hyderabad scientists help decode the genetic mystery

హైదరాబాద్ : దక్షిణాసియా జనాభాలో టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతున్న జన్యుక్రమ రహస్యాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ (సిసిఎంబి) శాస్త్రవేత్తలతోపాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఛేదించగలిగింది. జనాభా పరంగా ఉన్న తేడాల్లోని జన్యుగ్రహణ శీలత టైప్ 2 డయాబెటిస్‌కు దోహదం చేస్తోందని తమ అధ్యయనంలో గ్రహించారు. పూర్వీకుల నుంచి వంశానుక్రమంగా సంక్రమించే డయాబెటిస్ రిస్కును ముందుగా అంచనా వేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. భారతీయుల విషయంలో టైప్ 2 డయాబెటిస్‌తో అనేక చిక్కులు ఉన్నాయని, ప్రతి ఆరుగురిలో ఒకరికి డయాబెటిక్ సమస్య తీవ్రంగా ఉంటోందని సిసిఎంబి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దక్షిణాసియా ప్రజల్లో టైప్ 2 డయాబెటిస్ చిక్కులను అర్థం చేసుకోడానికి ఈ అధ్యయనంలో వివిధ రకాల జనాభాలను చేర్చడం ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ కు చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్ సహ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ అధ్యయనానికి డయామంటే ( డిఐఎఎంఎఎన్‌టిఇ డయాబెటిస్ మెటాఅనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్ ఎథ్నిక్ అసోసియేషన్ స్టడీస్ ) అని పేరు పెట్టారు. గత 30 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ నాలుగు రెట్లు పెరిగినట్టు అధ్యయనంలో తేలింది. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్, చైనా దేశాల్లో ఇది తీవ్రంగా వ్యాపిస్తోంది. భారతీయుల్లో ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ రిస్కు ఎక్కువగా ఉండడానికి స్థూలకాయం కారణం అన్న ప్రచారం ఉంటోంది. పొత్తి కడుపు చుట్టూ కొవ్వుపేరుకుపోవడం భారతీయుల్లో కనిపిస్తుంది. శరీరం లోని అవయవాల్లో కొవ్వు పేరుకు పోవడం ఇన్సులిన్ నిరోధకానికి దారి తీస్తోంది. యూరోపియన్లులో దీనికి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.

వాళ్ల శరీరంలో కూడా కొవ్వు ఉన్నా అది సాధారణ పద్ధతిలో ఉంటుంది. వాస్తవం ఇలా ఉన్నప్పటికీ ఐరోపా పూర్వీకుల నుంచి వస్తున్నటైప్ 2 డయాబెటిస్ విషయంలో జన్యుగ్రహణ శీలత పై అధ్యయనాలు కొనసాగాయి. వివిధ రకాల జనాభాలలో టైపు 2 డయాబెటిస్ జన్యుగ్రహణ శీలతలో పోలికలు, తేడాలు అర్థం చేసుకోడానికి ప్రపంచం లోని శాస్త్రవేత్తలందరూ ఏకం కావడం చెప్పుకోతగిన విషయమని సిసిఎంబి చీఫ్ సైంటిస్టు డాక్టర్ గిరిరాజ్ ఆర్ చందక్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో టైప్2 డయాబెటిస్ బాధితులు 1.8 లక్షల మంది తాలూకు జన్యుపరమైన డిఎన్‌ఎను యూరోపియన్లు, తూర్పు ఆసియన్లు, దక్షిణాసియన్లు, ఆఫ్రికన్లు, హిస్పానిక్స్ తదితర ఐదు విభిన్న జాతుల 11.6 లక్షల మంది తో పోల్పి సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News