వాషింగ్టన్ : జ్ఞాపకశక్తి, ఆలోచించడం వంటి సహజ లక్షణాలు క్షీణించి మానసిక వైకల్యం రావడం డెమెన్షియా వ్యాధి లక్షణాలు. ఇందులో ముఖ్యంగా మతిమరుపు పెరగడాన్ని అల్జిమర్స్ వ్యాధిగా చెబుతుంటారు. దీనికి మందు లేదంటారు. బ్రిటన్ లోని అల్జిమర్స్ రీసెర్చి విభాగం అంచనాల ప్రకారం 2025 నాటికి మిలియన్ మంది 2050 నాటికి రెండు మిలియన్ల మంది డెమెన్షియా రోగులు పెరుగుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోల్పోయిన జ్ఞాపకశక్తిని సరిదిద్దే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. జ్ఞాపకశక్తిని కోల్పోయిన ముసలి ఎలుకలో సెరెబ్రోస్పైనల్ ద్రవాన్ని ఎక్కించి తిరిగి జ్ఞాపక శక్తిని పెంచగలిగారు. మెదడు కండరాలను, వెన్నుపూసను పొడిబారకుండా తడిగా ఉంచేలా ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయెడ్ ఉపయోగపడుతుంది.
అటువంటి సెరెబ్రోస్పైనల్ ద్రవాన్ని చిన్నవయసు కలిగిన అంటే 18 నెలల వయసున్న ఎలుకల నుంచి సేకరించి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఎలుకకు శాస్త్రవేత్తలు ఇంజెక్టు చేసి జ్ఞాపకశక్తిని సరిదిద్దగలిగారు. ఈ సరికొత్త చికిత్స వివరాలు న్యూస్టడీ ఇన్ నేచర్‌లో వెలువడ్డాయి. మనుషుల మెదడులో కూడా ఈ ప్రయోగాలు వర్తిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వృద్దాప్యం వచ్చేసరికి సెరెబ్రోస్పైనల్‌ఫ్లూయెడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాంటి వృద్ధులకు తిరిగి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయెడ్‌ను మెదడుకు ఎక్కిస్తే జ్ఞాపకశక్తి మళ్లీ పెరగుతుందని కాలిఫోర్నియాకు చెందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ టోనీ విస్ కొరే వెల్లడించారు. ఈ అధ్యయన రచయితగా ఆయన పాలుపంచుకున్నారు. మెదడులో న్యూరాన్ కణాలు అంటే నాడీ కణాలు తిరిగి వృద్ది చెందించడం వల్ల వృద్ధులో జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. నాడీ వ్యవస్థ లోని ఈ కణాలు సమాచార సంకేతాలు ప్రసారం కాడానికి దోహదపడతాయి. చైతన్యం కలిగిస్తాయి.