డాక్టర్ల పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)-పిజి-2022 వాయిదావేయాలన్న డాక్టర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణలో జాప్యం వల్ల వైద్యుల కొరత ఏర్పడి రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం నీట్-పిజి కౌన్సలింగ్ జరుగుతున్న కారణంగా మే 21వ తేదీన జరగనున్న నీట్-పిజి–2022 వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు మే 10వ తేదీన సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం జసిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పరీక్షను వాయిదా వేయడం వల్ల గందరగోళం, అనిశ్చితి ఏర్పడగలదని, పరీక్ష కోసం తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న పెద్ద సంఖ్యలో విద్యార్థులపై దీని ప్రభావం పడగలదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక వర్గం విద్యార్థులు పరీక్ష వాయిదాను కోరుతుండగా, రెండో వర్గానికి చెందిన రెండు లక్షల ఆరు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధం కాగా వారిపై దీని ప్రభావం పడగలదని ధర్మాసనం పేర్కొంది. కరోనా కారణంగా జాప్యం ఏర్పడిన పరీక్ష షెడ్యూల్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ధర్మాసనం తెలిపింది. ఇందుకు కోర్టు కూడా సహకరించక తప్పదని ధర్మాసనం స్పష్టం చేసింది.