నిరసనలతో నినదించిన కశ్మీర్ పండిట్లు ..
అడ్డుకున్న భద్రతాబలగాలు పలుచోట్ల ఉద్రిక్తత
భట్ కాల్చివేతపై ఉద్యోగ పండిట్ల ఆక్రందనలు
శ్రీనగర్ : కశ్మీర్‌లోయలో పలు ప్రాంతాలలో శుక్రవారం కశ్మీర్ పండిట్ల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. తమకు ముప్పుగా మారిన కశ్మీర్ లోయనుంచి సురక్షితమైన వేరే చోటుకు తరలించాలని కశ్మీర్ పండిట్లు డిమాండ్ చేశారు. పలు ప్రాంతాలలో ఈ వర్గానికి చెందిన ప్రభుత్వోద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గురువారం బద్గామ్ జిల్లాలో చదూరా తహసీల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న రాహుల్ భట్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చిచంపారు. శుక్రవారం పండిట్ల ఆవేదనలు, ఆక్రందనలు నడుమ భట్ అంత్యక్రియలు జరిగాయి. ఇదే దశలో వేర్వేరు ప్రాంతాలలో పనిచేసే ఈ వర్గపు ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఈ లోయవీడుతామని, తమకు సురక్షితమైన వేరే ప్రాంతం కావాలని వీరు డిమాండ్ చేశారు. సెంట్రల్ కశ్మీర్‌లోనిషియిక్‌పోరా క్యాంపు కశ్మీర్ పండిట్లకు ఇప్పుడు తాత్కాలిక నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడనే శుక్రవారం పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పండిట్ల కుటుంబాలు అన్ని తరలివచ్చాయి. వీరంతా కలిసి ఎయిర్‌పోర్టు వైపు సాగారు. జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు.
లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం ఉద్రిక్తత
నిరసన ప్రదర్శనలు కుదరవని అంతా వెనుకకు వెళ్లాలని భద్రతా బలగాలు వారించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో చెలరేగిన ఘర్షణలను నివారించేందుకు భద్రతా బలగాలు తొలుత లాఠీచార్జి జరిపారు. ఫలితం లేకపోవడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్ఫవాయువు ప్రయోగించారు. ఎవరికి ఎటువంటి గాయాలు ఏర్పడలేదు. అయితే పోలీసు చర్యలో పలువురికి గాయాలు అయినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరిగింది. దీనిని అధికారులు తోసిపుచ్చారు. తమకు న్యాయం గురించి అంతకు ముందు తక్షణ ప్రాణరక్షణకు తాము డిమాండ్ చేస్తున్నామని, వెంటనే తమ ప్రాంతానికి లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వచ్చి తమ భద్రతకు తగు హామీ ఇవ్వాలని కశ్మీర్ పండిట్లు కోరారు. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెంటనే స్పందించింది. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ వేరే కార్యక్రమంలో ఉన్నారని, భట్ బంధువులను ఆయన ఇప్పటికే కలిశారని అన్ని విధాలుగా కశ్మీర్ పండిట్ల భద్రతకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఘటనపై ప్రతిపక్షాల ఖండన న్యాయానికి డిమాండ్
కశ్మీర్ పండిట్లకు తగు రక్షణ కల్పించాలని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముప్తీ డిమాండ్ చేశారు. తాను బద్గామ్‌కు వెళ్లి పండిట్లకు సంఘీభావం తెలియచేయాలనుకున్నానని అయితే అధికారులు తనను గృహనిర్బంధంలోకి నెట్టారని ఆరోపించారు. కశ్మీరీ పండిట్లు భద్రతకు డిమాండ్ చేస్తే వారి శాంతియుత ప్రదర్శనలను ప్రభుత్వం ఈ విధంగా దండనీతితో అణచివేసిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఇటువంటి ఉక్కుపాదాలు కశ్మీరీలకు కొత్త కాదని తరాలుగా ఇక్కడి జనం అనుభవిస్తున్న తంతు ఇదే అన్నారు.