Saturday, November 23, 2024

కుటిల కేంద్రం

- Advertisement -
- Advertisement -

సెక్యూరిటీ బాండ్ల వేలానికి కూడా రాష్ట్రానికి అనుమతి నిరాకరణ
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు ఓకే చెప్పి
తెలంగాణకు మాత్రం నో అన్న ఆర్‌బిఐ

దేశానికే రోల్‌మోడల్‌గా
నిలిచిన తెలంగాణపై
అదేపనిగా కక్ష సాధింపు
ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి
లోబడి తెచ్చుకునే
అప్పులకూ అవరోధాలు
కొత్త నిబంధనల పేరుతో
నిధుల సేకరణకు
అడ్డుకట్ట 17న
సెక్యూరిటీ బాండ్ల
వేలానికి ఎపి, మహారాష్ట్ర,
అనుమతిచ్చి.. అదేరోజున
తెలంగాణ ఉద్దేశించిన
రూ.2వేల కోట్ల నిధుల
సమీకరణకు తిరస్కృతి

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం దొంగదెబ్బ కొట్టింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో వాటిని విజయవంతంగా అమలుచేస్తూ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పీడుకు బ్రేకులువేసి ప్రజలు టీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి అపఖ్యాతి వచ్చేటట్లుగా చేసేందుకే కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం ఒక రాజకీయపరమైన కుట్రపూరితంగానే తెలంగాణ రాష్ట్రానికి నిధులు అందకుండా చేస్తోందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులే విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక విధానాలు బాగున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలుతీరు బాగుందని, ఆర్ధిక నిర్వహణలో తెలంగాణ భేషుగ్గా ఉందని గతేడాది కీర్తించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నేడు సెక్యూరిటీ బాండ్ల వేలానికి అనుమతులు ఇవ్వకపోవడం, ఎఫ్‌ఆర్ బిఎం పరిధికి లోబడు తెచ్చుకునే అప్పులకు కూడా అనుమతులు ఇవ్వకుండా కొత్త రూల్స్ పేరుతో అప్పులతో నిధుల సేకరణకు అ డ్డుకట్టవేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మెసేజ్ ఇస్తోందో.. చేసుకోవాలని ఆ అధికారులు కోరుతున్నారు. ఈనెల 17వ తేదీన రూ.2 వేల కోట్ల నిధుల సమీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది.

అందుకు అనుమతులు ఇస్తామని మొన్నటి వరకూ నమ్మబలుకుతూ వచ్చిన రిజర్వుబ్యాంకు అధికారులు నేడు ఉన్నట్టుండి సెక్యూరిటీ బాండ్ల వేలానికి అనుమతులు ఇవ్వడంలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు సమాచారం ఇచ్చారు. అంతేగాక ఈనెల 17వ తేదీన సెక్యూరిటీ బాండ్లను వేలానికిపెట్టి నిధులను సమీకరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం (ఆర్.బి.ఐ) అనుమతులు మంజూరు చేసింది. నిన్నా& మొన్నటి వరకూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి అండగా ఉంటూ వచ్చిందని, కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు, రైతుల సంక్షేమం విషయంలో కేంద్రంతో విభేదించినందుకు ఇలా కక్షసాధిస్తున్నట్లుగా పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు అంటున్నారు. అంతేగాక ఎఫ్.ఆర్.బి.ఎం (ఫైనాన్స్ రెగ్యులేషన్ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం ప్రకారం తెచ్చుకునే అప్పులకు కూడా అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లుగా తెలిసింది.

ఇటీవల కేంద్ర ఆర్ధికశాఖా కార్యదర్శి టి.వి.సోమనాధన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్ధికశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల మెడలపైన కత్తిపెట్టడాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం పునరాలోచనలో పడిపోయిందని, కొత్తగా ప్రవేశపెట్టిన రూల్సును రద్దు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని సమాచారం ఇచ్చిన కేంద్ర ఆర్ధికశాఖాధికారులు రెండురోజుల్లోనే మళ్ళీ ప్లేటు ఫిరాయించి సెక్యూరిటీ బాండ్ల వేలానికి కూడా అనుమతులు ఇవ్వకపోవడం, ఎఫ్.ఆర్.బి.ఎం.చట్ట ప్రకారం సేకరించుకునే అప్పులపైనా ఆంక్షలు విధించడం వంటివి కేంద్రం ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతోందని ఆ అధికారులు మండిపడుతున్నారు. రాష్ట్రాలు అప్పుల రూపంలో నిధులను సేకరించుకోవడంపై కేంద్రం ఆర్టికల్ 292, 293ల ప్రకారం ఆంక్షలు విధించే అధికారం తమకుందనే ఉద్దేశ్యంతోనే ఇలా వేధింపులకు గురిచేస్తోందని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 53,970 కోట్ల రూపాయలను అప్పులు తెచ్చుకొని రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది.

ఆ మేరకు వార్షిక బడ్జెట్‌ను కూడా రూపొందించుకొని స్పష్టమైన కేటాయింపులు జరిపింది కూడా. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు 53 వేల 970 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. అంటే నెలకు కనీసం 4,500 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో నిధులను సేకరించుకొని ఈ కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉండింది. దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయల నిధులు అవసరం కాగా ఈ పథకానికి నెలకు 1500 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. ఆసరా పెన్షన్లకు వెయ్యి కోట్లు, రైతు బంధు పథకానికి 7,500 కోట్లు, ఉచిత విద్యుత్తు పథకానికి నెలకు సుమారు 600 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ప్రఖ్యాతిగాంచిన ఈ పథకాలనే రిజర్వుబ్యాంకు కూడా కీర్తించింది కూడా. అంతేగాక ప్రఖ్యాత వ్యవసాయ నిపుణులు స్వామినాథన్ కూడా రైతుబంధ పథకానికి మద్దతు తెలిపారని, ఇలాంటి దేశం గర్వించదగిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుండగా, వాటిని ముందుకు సాగకుండా చేసేందుకే ఇలా అప్పులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం కక్ష సాధిస్తోందని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.

వాస్తవానికి ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన మొదటి త్రైమాసికంలో సుమారు 15 వేల కోట్ల రూపాయలను అప్పుల రూపంలో నిధులను సేకరించుకోవాలని అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ అనేక కొర్రీలు వేస్తూ ఏకంగా రెండు నెలల కాలయాపన చేసి తీరా గతించిన రెండు సంవత్సరాల్లోని అప్పులను కూడా ఇప్పటి రూల్సును వర్తింపజేస్తూ కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదని కేంద్రం దొంగదెబ్బ కొట్టడాన్ని ఆర్ధికశాఖాధికారులు జీర్ణించుకోలేకపోతున్నామని అంటున్నారు. ఇలా కేంద్రం ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టి రాష్ట్రాన్ని ఆర్ధికంగా సమస్యల్లో కూరుకుపోయేటట్లు చేయడంతో ప్రభుత్వ పెద్దలు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులను సమీకరించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆ అధికారులు వివరించారు. రాష్ట్రం సొంత ఆదాయ మార్గాలు, నిరర్ధక ఆస్తుల అమమ్మకం, నిరుపయోగంగా పడివున్న భూములు, పరిశ్రమలకు కేటాయించిన భూములను అమ్మకాలు, రాజీవ్ స్వగృహ ఇళ్ళ అమ్మకాలు, వాహనాల లైఫ్‌ట్యాక్స్, గనుల విభాగం నుంచి, అటవీ శాఖల నుంచి కనీసం 40 వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకొని ఆ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ అధికారులు వివరించారు. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని కూడా ఆ అధికారులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News