సిఎం కెసిఆర్
ఉన్నతస్థాయి సమీక్ష
20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి
18న సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఐదవ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ నెల 18వ తేదీన ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేయనున్నారు. నాలుగు విడతల్లో సాధించిన అభివృద్ధితో పాటు ఇంకా మిగిలిపోయిన పనులపై కూడా సమీక్షించనున్నారు. అలాగే ఐదవ విడతలో ప్రధానంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు సిఎం కెసిఆర్ హితబోధ చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంపై ఉన్నతాధికారులు మరింత దృష్టి సారించాల్సిన అంశంపై సిఎం కెసిఆర్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపిఒలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.