హైదరాబాద్ : కేంద్రం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన చేపట్టాలని, పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న బెంగళూరులో అఖిల భారత బిసిల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ సమావేశానికి 29 రాష్ట్రాల నుంచి బిసి ప్రముఖులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు పాల్గొంటారని తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ ప్రధానమంత్రి దేవగౌడ , ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇతర అన్ని పార్టీల నాయకులు హాజరవుతారని తెలిపారు. బిసి జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ప్రభుత్వాలకే ఉందన్నారు. కేంద్రం త్వరలో చేపట్టే జనగణనలో కులగణన చేపట్టేలా అన్ని పార్టీలు వత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో బిసి సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, కోలా జనార్ధన్, నీల వెంకటేష్, సి.రాజేందర్, నీరడి భుపేష్‌సాగర్, వేముల రామకృష్ణ, పండరినాథ్, అంతయ్య పాల్గొన్నారు.