ఉక్రెయిన్ సైనిక జనరల్ వెల్లడి
కీవ్ : రష్యాలో అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఇప్పటికే భారీ స్థాయి కుట్ర జరుగుతోందని ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుతిన్ ఎక్కువ కాలం పదవిలో ఉండలేరు. ప్రత్యర్థులు ఆయనను ఉండనివ్వరు. ఈ దిశలోనే గూడుపుఠాణి జరుగుతోందని స్కైన్యూస్‌తో మాట్లాడుతూ ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ ప్రకటించారు. ఇది తనకు అందిన అత్యంత కీలక సమాచారంతో కూడిన అంచనా అని వెల్లడించారు. పుతిన్‌పై కుట్ర ఇప్పట్లో ఆగదు. అటో ఇటో తేలేదాకా సాగుతుందన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత యుద్ధం ఆగస్టు మధ్యనాటికి కీలక మలుపు తిరుగుతుంది. ఈ ఏడాది చివరికి ముగుస్తుందని వెల్లడించారు. ఈ దశలోనే రష్యా ఫెడరేషన్ అధినాయకత్వంలో కీలక మార్పులు జరుగుతాయని తెలిపారు. క్రెమ్లిన్ నేతకు ఇప్పటికే క్యాన్సర్ ఉందని, ఇతర జబ్బులు కూడా ముదురుతున్నాయని అంతేకాకుండా ఆయన మానసిక స్థితి బాగాలేదు. శారీరకంగా అలసిపొయ్యారు. ఎప్పుడేమైనా జరగవచ్చు. కుట్రలు ఇతరత్రా అసాధారణ పరిస్థితులు అంతర్గతంగా జరిగితే తట్టుకునే స్థితిలో లేరని ఈ లెఫ్టినెంట్ తేల్చిచెప్పారు.