Friday, December 20, 2024

తొలకరిస్తున్న ఆశలు

- Advertisement -
- Advertisement -

వానాకాలపు సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు

రాష్ట్రమంతటా ఒక మోస్తరుగా
కురుస్తున్న వర్షాలు వర్షాధార
భూముల్లో సేద్యంపై దృష్టిపెట్టిన
వ్యవసాయదారులు ఈసారి
తొందరగా తొలకరి వానలు
కురుస్తాయన్న సమాచారంతో
అంతటా హర్షం జూన్ మొదటి
వారంలోనే నైరుతి రుతుపవనాలు
రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం
వర్షాలు ఎక్కువ రోజులు
కురుస్తాయని సమాచారం
గత వానాకాలం కంటే అదనంగా
6లక్షల ఎకరాలు సాగులోకి
తేవాలని లక్షం

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు వ్యవసాయరంగంలో ఆశలు రేకేత్తిస్తున్నాయి.. నేల పదునెక్కితే దుక్కులు దున్ని వానాకాలపు పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. రాష్ట్రమంతటా ఒక మోస్త రు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాధార భూముల్లో సేద్యం పనులపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకించి పత్తిసాగుకు ఏర్పాట్లు చే సుకుంటున్నారు. ఈసారి జూన్ తొలివారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు దక్షిణ అండమాన్, అగ్నేయ బంగాళాఖాతంలోకి నైరు తి రుతుపవనాలు ప్రవేశించాయని , ఇవి ఈ నె లాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకనున్నట్టు తెలిపారు. జూన్ తొలివారంలో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండి అధికారుల అంచనాలతో వ్యవసాయరంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షపు రోజులు కూడా ఎక్కవగానే ఉంటాయన్న అంచనాలు వ్యవసాయ రంగాన్ని మరింత ఉత్సాహపరుస్తున్నాయి.

రాష్ట్రంలో ఈ వానాకాలానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల సాగు విస్తీర్ణంపై భారీ అంచనాలే పెట్టుకుంది. గత వానాకాలపు పంటల సాగు విస్తీర్ణం కంటే మరో ఆరు లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగులోకి తేవాలని లక్షంగా పెట్టుకుంది. అన్ని రకాల పంటలు కలిపి కోటి 35లక్షల ఎకరాలకు పైగానే సాగు చేయించాలని లక్షంగా పెట్టుకుంది. అందులో పత్తి ,వరి , కంది పంటల సాగువిస్తీర్ణమే 95శాతంగా ఉండబోతోంది. వ్యవసాయ శాఖ అధ్యర్వంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జిల్లా స్థాయి వ్యవసాయ పంటల సాగు ప్రణాళిక తొలి ప్రోత్సాహక సదస్సును ప్రారంభించిన ప్రభుత్వ జిల్లాల వారీగా ఈ సదస్సులు నిర్వహిస్తోంది. వ్యవసాయశాస్త్రవేత్తలు , వ్యవసాయ , ఉద్యాన శాఖల అధికారులు , ఆదర్శ రైతులద్వారా ఈ సదస్సుల్లో వానాకాలపు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను రైతులకు వివరిస్తున్నారు. నేలల స్వభావం, సాగు నీటివనరుల లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి జిల్లాల వారీగా ఇప్పటికే వానాకాలపు పంటల సాగు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.

విత్తన ఎంపికే కీలకం :

వ్యవసాయరంగంలో ఏ పంటలకైనా విత్తన ఎంపికే అత్యంత కీలకం కావటంతో రైతులకు మేలురకం విత్తన ఎంపిక పట్ల అవగాహన కల్పింస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగు విస్తీర్ణంలో 50శాతంపైగా పత్తిసాగు చేయించాలని ప్రణాళిక సిద్దం చేస్తున్న నేపధ్యంలో పత్తి విత్తనాలకు ప్రాధాన్యత పెరిగింది. పత్తికి ప్రభుత్వం క్వింటాలుకు కనీసమద్దతు ధర రూ.6025 అమలు చేస్తుండగా మార్కెట్‌లో ఈ సారి పత్తిధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో క్వింటాలు పత్తి రూ.13050 పలికింది.దీంతో రాష్ట్రంలో రైతులు కూడా ఈ సారి పత్తి సాగు పట్ల ఉత్సాహంగా ఉన్నారు. పత్తిసాగులో అత్యధికంగా బిజి2రకం సాగువుతోంది. క్రైవన్ ఎసి, క్రైటూ ఎబి అనే రెండు రకాల జన్యువులు ఈ రకం పత్తిలో ఉంటాయి. పత్తిలో ఎన్నో కొత్త రకాలు ఉన్పప్పటికీ రైతులు వాటిజోలికి పోకుండ అధిక దిగుబడులు ఇచ్చే మేలురకం విత్తనాలనే ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

విడిగా లభించే విత్తనాల్లో బిటి జన్యువు ఉందో లేదో తెలిసే అవకాశం లేనందున రైతులు పత్తివిత్తనాలను గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే అధికృత కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని ,కొన్న విత్తనాలకు పూర్తి వివరాలతో కూడిన రశీదు పొంది పంటకాలం పూర్తయ్యేవరకూ రసీదను భద్రపరుచుకోలాని సూచిస్తున్నారు. గతంలో బిటి పత్తి విత్తనాలు 450గ్రాముల ప్యాకేట్‌తోపాటు 125గ్రాముల చిన్న నాన్‌బిటి విత్తనాల ప్యాకెట్ కూడా ఇచ్చేవారు. దీన్ని రైతులు పక్కన పెట్టేసేవారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బ్లెన్‌డెడ్ సీడ్ పేరుతో బిటి విత్తనాలకు నాన్‌బిటి విత్తనాలు 510శాతం కలిపి ఒకే ప్యాకెట్‌లో ఇచ్చేలా చర్యలు తీసుకుంది.దీంతో నాన్‌బిటి విత్తనాలు కూడా పొలంలో పడతాయి. అమెరికన్ బోల్ (శనగ పచ్చపురుగు ) తలనత్త పురుగు వంటివి నాన్‌బిటి విత్తనాలకే సొకి అక్కడికే పరిమితం అవుతుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా పత్తిసాగు చేస్తున్న రైతులు పంట మార్పిడి పద్దతులు పాటించాలని సూచిస్తున్నారు.

పెరిగిన విత్తన ధరలు:

పత్తి విత్తనం ధరలను పెంచివేశారు. గత ఏడాది సీజన్ ప్రారంభంలో పత్తి విత్తనాల ధరలతోపోలిస్తే ఈసారి ఒక్కో ప్యాకెట్‌పైన రూ.80పెరిగింది. గత ఏడాది 450గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.730వుండగా, ఈ సారి వీటి ధరను రూ.810కు పెంచివేశారు. రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ సారి కోటి 50లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, అదనంగా మరో 20లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

నేడు, రేపు కూడా కురిసే అవకాశం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు వానలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News