కరాచీ: పాకిస్తాన్‌లో ఇటీవల తమపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో చైనా అధికార భాష మాండరిన్‌ను పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో బోధిస్తున్న చైనా ఉపాధ్యాయులు చైనా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారని కరాచీ యూనివర్సిటీ సోమవారం తెలిపింది. గత నెల 26న ప్రతిష్టాత్మక కరాచీ యూనివర్సిటీలో స్థానిక ప్రజలకు చైనా అధికార భాష మాండరిన్‌ను బోధించేందుకు ఏర్పాటు చేసిన కన్ఫూషన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిషిద్ధ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మానవ బాంబు జరిపిన ఆత్మాహతి దాడిలో ముగ్గురు చైనా జాతీయులైన ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. చైనా ఉపాధ్యాయులే లక్షంగా చేసుకుని జరిపిన ఈ ఆత్మాహుతి దాడి అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చేయాలని చైనా వారికి పిలుపునిచ్చింది. దీంతో పాక్‌లోని వివిధ యూనివర్సిటీలలో మాండరిన్ బోధిస్తున్న చైనా ఉపాధ్యాయులు ఆదివారం వాపసు వెళ్లిపోయారని యూనివర్సిటీ అధికారి ఒకరు చెప్పారు.