రైల్వేకు రూ. 1500 కోట్ల అదనపు ఆదాయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వయో వృద్దులు, సహా ప్రయాణీకులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్తాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా గడిచిన రెండేళ్లలో వయోవృద్దులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్టు తేలింది.. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్లకు అందించే రాయితీని భారతీయ రైల్వే నిలిపివేసింది. తద్వారా 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్ ప్రయాణికులు ఈ ప్రయోజనాన్ని పొందలేక పోయారు. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్ల ప్రయాణికుల నుంచి రూ.3464 కోట్ల ఆదాయం రైల్వేకు వచ్చింది.
వారికి రాయితీ ఇవ్వనందున భారతీయ రైల్వేకు రూ. 1500 అదనపు ఆదాయం సమకూరినట్టయింది. రెండేళ్లలో రైళ్లలో ప్రయాణించిన ఏడున్నర కోట్ల వృద్ధుల్లో 4.45 కోట్ల మంది 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులు, మరో 2.84 కోట్ల మంది 58 ఏళ్ల వయసుపైబడిన మహిళలు ఉన్నారు. వీరితోపాటు మరో 8310 మంది ట్రాన్స్‌జండర్లు ఈ ప్రయోజనం పొందలేక పోయారు. ఇదిలా ఉంటే రైళ్లలో ప్రయాణించే వయో వృద్ధులకు భారతీయ రైల్వే రాయితీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. 50 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తుండగా, 60 ఏళ్లు పైబడిన పురుషులకు మాత్రం 40 శాతం రాయితీని భారతీయ రైల్వే అందిస్తోంది. మొత్తం 53 రకాల రాయితీలను కల్పిస్తోన్న రైల్వేకు ప్రతి ఏటా దాదాపు 2 వేల కోట్ల భారం పడుతున్నట్టు సమాచారం. వీటిలో సీనియర్ సిటిజన్ల కన్షెషన్ వల్లే ఎక్కువ భారం పడుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.