ప్రధాని విక్రమసింఘె ప్రకటన
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ ఎయిర్‌లైన్స్‌ను విక్రమించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యోచిస్తోంది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటుపరం చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘె సోమవారం టెలివిజన్ ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ 4500 కోట్ల రూపాయల(124 మిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసినట్లు ఆయన తెలిపారు. ఈ భారాన్ని ఏనాడూ విమానంలో కాలుపెట్టని పేద ప్రజలు భరించడం సబబు కాదని ఆయన అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి తమ ప్రభుత్వం కరెన్సీని ముద్రించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం ఒక్కరోజుకు మాత్రమే సరిపోతాయని, ముడి చమురు, శుద్ధి చేసిన చమురుతో శ్రీలంక సముద్ర తీరంలో నిలిచి ఉన్న మూడు నౌకలకు చెల్లించడానికి బహిరంగ మార్కెట్‌లో డాలర్లు కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.