బెంగళూరు : కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ బిల్లును శాసనసభ గత డిసెంబరులో ఆమోదించింది. మతమార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక తొమ్మిదోది. తప్పుడు వివరణ, బలవంతం , మోసం, అనుచిత ప్రలోభాలు, నిర్బంధం, లేదా పెళ్లి వంటి కారణాలతో ఒక మతం వారు మరో మతం లోకి మారడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది. ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడిన వారికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా రూ. 25,000 వరకు జరిమానా విధించవచ్చు. మైనర్, మహిళ, షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని చట్ట విరుద్ధంగా మతం మార్చిన వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష రూ. 50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టానికి వ్యతిరేకంగా సామూహిక మత మార్పిడులకు పాల్పడిన వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 1,00,000 వరకు జరిమానా విధించవచ్చు.