లిస్టింగ్ తొలి రోజు 8% తగ్గిన కంపెనీ షేర్
మార్కెట్ విలువ పరంగా ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరణ
ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లిస్టింగ్ తొలి రోజు నిరాశపర్చింది. ఈ షేరు డిస్కౌంట్ ధరకే ట్రేడ్ అయింది. స్టాక్ ధర 8 శాతం దిగువకు పడిపోయింది. ఎల్‌ఐసి షేరు ఇష్యూ ధర రూ.949 నుంచి 7.77 శాతం తగ్గి రూ.875.25 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు మొదటి రోజునే భారీ నష్టాన్ని చవిచూశారు. ఐపిఒ ధర ఆధారంగా చూస్తే ఎల్‌ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,00,242 కోట్లు ఉంటుంది. అయితే మంగళవారం తొలిరోజు స్టాక్ ముగిసిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,53,595 కోట్లకు తగ్గింది. అంటే తొలిరోజు ఇన్వెస్టర్లు రూ.47,000 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎల్‌ఐసి స్టాక్ బిఎస్‌ఇలో రూ. 867 వద్ద లిస్ట్ కాగా, ఇది కూడా ఇష్యూ ధర కంటే 8.62 శాతం తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా పెట్టుబడిపై మంచి రాబడిని పొందుతామని ఎల్‌ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. 1956 నుంచి నిరంతరం ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తున్నట్లు తెలిపారు. నిరుత్సాహకరమైన లిస్టింగ్ ఉన్నప్పటికీ ఎల్‌ఐసి దేశంలో ఐదో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. దీంతో మార్కెట్ విలువ పరంగా హెచ్‌యుఎల్ స్థానం తగ్గింది.
భారీగా 1,345 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. సోమవారం తర్వాత మంగళవారం కూడా మార్కెట్లు జోరును చూపాయి. అయితే ఈసారి కొనుగోళ్ల జోరు పెరగడంతో సూచీలు పైపైకి ఎగశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,345 పాయింట్లు కోల్పోయి 54,318 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259 పాయింట్ల వద్ద స్థిరపడింది. టాటా స్టీల్, రిలయన్స్, ఐటిసి, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 7 శాతం వరకు లాభపడి, టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో అన్నీ కూడా గ్రీన్‌లో కనిపించాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఇ ప్లాట్‌ఫామ్‌పై సెక్టోరల్ ఇండెక్స్ చూస్తే, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఆటో రంగాలు 6 శాతం వరకు లాభపడ్డాయి. లిస్టింగ్ రోజు ఎల్‌ఐసి నిరాశపర్చగా, ఈ షేరు 8 శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్ అయింది. వచ్చే నెలల్లో భారతదేశం స్టీల్ ఎగుమతులు బలంగా ఉంటాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇచ్చిన అంచనాలతో మెటల్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఇక రూపాయి విలువ మరింతగా పతనం అయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 77.56తో జీవితకాల కనిష్టానికి పడిపోయింది.