అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా ఆరబెట్టి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలి
కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి
అధికారులు మరింత అప్రమత్తతో రైతులకు హాని కలగకుండా చూడాలి
కొనుగోల్లు మొదలై నెలరోజులు గడుస్తున్న కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు
అయినా సేకరణ సాఫీగా జరుగుతుంది. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేదు : మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్య సేకరణపై సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్
మనతెలంగాణ/హైదరాబాద్ : వరి రైతులకు కేసిఆర్ సర్కారు అభయం ఇచ్చింది. అకాల వర్షాలు ప్రకృతి వైపరిత్యాలతో తడిసిపోయిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పింది. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని, ప్ర భుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతంగానికి భరోసా ఇచ్చారు. అకా ల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్లో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్నీ సంచులు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అకాల వర్షాలపై జిల్లా స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, దీని ప్రభా వం రైతాంగంపై ఏమాత్రం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకుని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఈ విషయంలో మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రైతాంగానికి నష్టం జరగకుండా సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
20.25 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు :
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సజావుగా సాగుతోందని, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందడం లేదని అయితే ప్రతిపక్షాలు, మీడియా మాత్రం ఏదో జరుగుతుందన్నట్లు రైతాంగాన్ని భయాందోళనలకు గురిచేసే విధంగా వ్యవహరిచండం దురదృష్టకరమని అన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిచండం లేదన్నారు, కొనుగోళ్ళు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న కొత్తగా ఒక గన్ని సంచిని కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటి వరకు 9.97 కోట్ల గన్నీ సంచులను సమకూర్చుకుందని, ఇందులో ఇప్పటి వరకు 4.65 కోట్ల గన్నీ సంచులను కొనుగోళ్లకు వినియోగించడం జరిగిందిదని తెలిపారు. ఇంకా 5.32 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు.
రోజుకు దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 6369 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. 3.18 లక్షల మంది రైతుల నుంచి రూ. 3961 కోట్ల విలువ చేసే 20.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. ఇందులో 19.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగిందన్నారు.
తరుగు తీస్తే చర్యలు తప్పవు :
తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అటువంటి వారిని అవసరమైతే బ్లాక్ లిస్టులో పెట్టాడానికి వెనకడాబోమని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్దని ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
మెదక్ జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలకు గానూ 335 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని, 14561 మంది రైతుల నుండి 190 కోట్ల విలువగల 1లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఇందుకోసం 25 లక్షల గన్నీ సంచులను వాడామని, ఇంకా జిల్లాలో 16 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 413 కొనుగోలు కేంద్రాలకు గానూ మొత్తం కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. 11485 మంది రైతుల నుండి 112 కోట్ల విలువగల 57వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఇందుకోసం 15 లక్షల గన్నీల్ని వాడామని ఇంకా జిల్లాలో 53లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, మెదక్ కలెక్టర్ హరీష్, మెదక్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్లు, ఇతర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.