Tuesday, December 24, 2024

అదుపు తప్పిన ద్రవ్యోల్బణం!

- Advertisement -
- Advertisement -

Inflation increased in India due to Russia-Ukraine War

కొవిడ్‌తో దీర్ఘకాలం లాక్‌డౌన్లలో మగ్గి ఉత్పత్తులు దెబ్బతిన్న ప్రపంచ గిరాకీ సరఫరాల వ్యవస్థ ఉక్రెయిన్ యుద్ధంతో మరింత అస్వస్థతకు గురైంది. అమెరికా సహా అంతటా ద్రవ్యోల్బణం పేట్రేగిపోయింది. క్రూడాయిల్ తదితర ప్రధాన అవసరాలకు దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థ కుంగికునారిల్లిపోయింది. అసలే అంతంత మాత్రంగా వున్న దేశ ఉత్పత్తి రంగం మరింతగా కుదేలైపోయింది. దేశంలో గత ఫిబ్రవరి నుంచి పెరిగిన చిల్లర ద్రవ్యోల్బణంలో ఐదింట మూడొంతులు ఉక్రెయిన్ యుద్ధం నుంచి సంభవించిందేనని నిపుణులు స్పష్టం చేశారు. అందుచేత భారత రిజర్వు బ్యాంకు ప్రకటించిన అసాధారణ వడ్డీ రేట్ల పెంపుదల ద్రవ్యోల్బణాన్ని అరికట్టే అవకాశాలు దాదాపు శూన్యమేనని వారు చెబుతున్నారు. వినియోగదార్ల ధరల సూచీ ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకున్నది. ఇందులో గ్రామీణ ప్రాంతాల ద్రవ్యోల్బణం, గత 96 మాసాల్లో ఎన్నడూ లేనంతగా 8.4 శాతానికి ఎగబాకింది. దీనితో రిజర్వు బ్యాంకు ఈ నెలలో అత్యవసర సమావేశం జరిపి వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్, ఆగస్టు నెలల్లో జరిపే సమీక్షల్లో కూడా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. అయితే యుద్ధం వల్ల సంక్రమించిన విపత్కర పరిస్థితులు సద్దుమణగకుండా కేవలం వడ్డీ రేట్లు పెంపుదల వల్ల ధరలు, ద్రవ్యోల్బణం సద్దుమణగకపోగా దేశంలో ఉత్పత్తి దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తగిలిన మొట్టమొదటి దెబ్బ మనం ఉపయోగించే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోడం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు గత ఫిబ్రవరి 24న మొదలయ్యాయి. అప్పటి నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధర 11 శాతం విజృంభించింది. ప్రపంచంలో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా ముఖ్యమైనది. 2020లో రష్యా రోజుకి 10.5 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం తదితర ద్రవ ఇంధనాలను ఉత్పత్తి చేసింది. ఇందులో 9.9 మిలియన్ బ్యారెళ్లు క్రూడాయిలే. 2021 జనవరి నాటికి దాని వద్ద 80 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు వున్నాయి. యుద్ధం వల్ల రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ సరఫరాలకు అంతరాయం ఏర్పడి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఒక దశలో 140 డాలర్లకు చేరిపోయింది. ప్రస్తుతం 115 డాలర్ల వద్ద వున్నప్పటికీ ఇది భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసే అంశమే.రష్యా సరఫరాలకు అంతరాయం వల్ల పెరిగిన ధరలను అదుపులోకి తేవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ఉత్పత్తిని పెంచినందు వల్ల క్రూడ్ ధరలు తిరిగి తగ్గడం ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎగబాకాయి. ఈ విధంగా ఉక్రెయిన్ యుద్ధం మొట్టమొదటి అమిత వ్యతిరేక ప్రభావం భారత దేశం మీద పడింది. ఇంకా రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకునే సన్‌ఫ్లవర్ ఆయిల్, మందులు వగైరాలపై దీని దుష్ప్రభావం పడింది. దేశంలో వంట నూనెల ధరలు ఆకాశానికి అంటడం వెనుక యుద్ధం ప్రభావం వుంది. అందుచేత రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచినందున దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం అదుపులోకి రావని నిపుణులు సహేతుకంగానే హెచ్చరిస్తున్నారు. రోగమొకచోట వుంటే మందు ఇంకొక చోట వేయడం విజ్ఞత కాదని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపు మీరుతున్నదని గోల్డ్‌మన్ శాచెట్స్ హెచ్చరించింది. ద్రవ్యోల్బణం కారణంగా అమెరికా స్థూ ల దేశీయోత్పత్తి తగ్గవచ్చని కూడా జోస్యం చెప్పింది. దీని ప్రభావమూ భారత ఆర్థిక వ్యవస్థపై వుంటుందని భావిస్తున్నారు. డాలర్ విలువ ఉత్థాన పతనాలు మన ఎగుమతి, దిగుమతులపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో భారత పాలకులు తీసుకోవలసిన చర్యలు అనేకం వున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి దేశంలో మత వైషమ్యాలు పెంచడం మీదనే దృష్టి పెట్టడం కంటె అవివేకం వుండదు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల అతి బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతానన్న ప్రధాని మోడీ ప్రకటన ఆచరణ సాధ్యం కాని ప్రగల్భంగానే రుజువైపోయింది. 2016లో అత్యంత ఘనంగా చెప్పుకొని మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు దేశాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అప్పటికి మార్కెట్‌లో వున్న నగదు ప్రవాహం 86 శాతం అదృశ్యమైపోయి సాధారణ ప్రజానీకాన్ని నానా ఇడుముల పాలు చేసింది. అలాగే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు చిన్న, మధ్య తరహా వ్యాపారాలను మూయించి వేసింది. 2021 అక్టోబర్‌కి ముందు గల ఏడాదిన్నర కాలంలో దేశంలో 14 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఒక అంచనా. ఇందులో సగం ఉద్యోగాల నష్టం కొవిడ్ వల్ల సంభవించి వుండవచ్చు. కాని మిగతా సగం మంది ఉద్యోగాలు కోల్పోడానికి ప్రధాని మోడీ ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలే కారణం. ఇప్పటికైనా రామరాజ్య కలల్లో నుంచి బయటపడి వాస్తవిక దృష్టితో దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి అందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల సహకారాన్ని తీసుకోడానికి గట్టి కృషి జరగాలి.

Inflation increased in India due to Russia-Ukraine War

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News