హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులపై పలు పశ్నలతో ద్వజమెత్తారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా?, ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా?. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు.. వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారో చెప్పే చిత్తశుద్ది బిజెపి నాయకులకు ఉన్నదా?. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా?, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా?, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా?. తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు?. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారని, మంత్రి కేటీఆర్ అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని, ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Kavitha Slams Telangana BJP Leaders