హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తీసుకొని వెళ్లి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు పద్మశ్రీ తిమ్మక్కను పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ… మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ భాద్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్క గారిని మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచి పనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించ వచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క గారు నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని కేసిఆర్ ఆకాంక్షించారు.
కాగా, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం పర్యావరణ హితం కోసం పని చేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
Padma Shri Thimmakka meets CM KCR