హైదరాబాద్: నగర సమాగ్ర అభివృద్దే లక్ష్యంగా నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జూన్ 3 నుండి 15 రోజుల వరకు వార్డుల పరిధిలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లను బుధవారం క్యాంపు కార్యాలయం లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రణాళిక. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధేయ్యంగా ముఖ్యమంత్రికె.చంద్రశేఖరరావు రూపకల్పన చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. వర్షకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి నగరవాసులకుపూర్తి స్థాయి అవగాహన కల్పించడంతోపాటు విస్తృతంగా ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పనికి రాని వస్తువులు, నిర్మాణ వ్యర్థాల కోసం తాత్కాలిక పాయింట్ గుర్తించి సేకరించిన మొత్తాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల చుట్టూ కలుపు తీయడం, మట్టి పోయడం, ఎండిపోయిన మొక్క స్థానంలో మరొక మొక్క నాటాలని, ప్రజా ఉపయోగ స్థలాలు, ఇన్సిట్యూషన్ లో నీరు నిలువకుండా చర్యలను తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండేలా చూడాలపి మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్, శానిటేషన్ యు బి డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.