Monday, December 23, 2024

షీనా బొరా హత్య కేసు… ఇంద్రాణీ ముఖర్జియాకు బెయిల్

- Advertisement -
- Advertisement -

Indrani Mukerjea gets bail

న్యూఢిల్లీ : ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు , షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలిచ్చింది. విచారణ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుండటంతో ఆమెకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. “ ఈ కేసు అర్హతల గురించి మేం మాట్లాడట్లేదు. కానీ కేసు విచారణ ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా కన్పించట్లేదు. కనీసం 50 శాతం సాక్షులను విచారించాలన్నా చాలా సమయం పట్టేలా ఉంది. ఆరున్నరేళ్లుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఇది చాలా ఎక్కువ. ఇంద్రాణీకి బెయిల్ మంజూరు చేస్తున్నాం. ” అని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వం లోని ధర్మాసనం వెల్లడించింది. ఇంద్రాణీ 2015 నుంచి ముంబై లోని బైకుల్లా జైలులో ఉంటోన్న విషయం తెలిసిందే.

షీనా బోరా హత్య కేసు ఇదీ…

2012 లో షీనా బోరా హత్య జరగ్గా…. మూడేళ్ల తరువాత ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.ఓ కేసులో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ రాయ్ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో 2012 లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్య చేశారని చెప్పాడు. అంతేగాక , ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్టు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా, షీనా ఇంద్రాణీ కుమార్తేనని తేలింది. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటి లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడి అతని నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాని వివాహం చేసుకొంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా, ముంబైకి వెళ్లి ఇంద్రాణీని కలిసింది.

అయితే ఇంద్రాణీ మాత్రం షీనాను అందరికీ చెల్లిగా పరిచయం చేసింది. ఈ క్రమం లోనే పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్ ముఖర్జియా షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. అదే సమయంలో షీనా, ఇంద్రాణీ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ, తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్ లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ఇంద్రాణీ , సంజీవ్‌లతోపాటు పీటర్ ముఖర్జియాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైల్లోనే ఇంద్రాణీ పీటర్‌ల వివాహ బంధానికి ముగింపు పడింది. 2019 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2020 లో పీటర్ బెయిలుపై విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News