Friday, January 10, 2025

ఈసారి నుంచే ఆన్‌లైన్ ఆడిటింగ్

- Advertisement -
- Advertisement -

15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల అమలుకు
పురపాలక శాఖ కార్యాచరణ
పుర సంఘాలు, నగర పాలక సంస్థల గణాంకాలు ఆన్‌లైన్‌లో నమోదు
ఆడిట్ రిపోర్టును ఆన్‌లైన్‌లో ఉంచితే
బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలోని మునిసిపాలిటీలు గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మునిసిపాలిటీల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రాథమిక (ప్రొవిజనల్) గణాంకాలను, ఆడిట్ చేసిన లెక్కలను ఎప్పుడు కావాలంటే అప్పుడు థర్డ్ పార్టీ తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో ఈ ఏడాది నుంచి పూర్తి ఆన్‌లైన్ ఆడిటింగ్ నిర్వహించడానికి వీలుగా కార్యాచరణను పురపాలక శాఖ డైరెక్టరేట్ సిద్ధం చేసింది. గతేడాది (2021-,22)కు సంబంధించి నిర్వహణ లెక్కలను ఆన్‌లైన్ ఉంచడంతో ఈ ఆర్థిక ఏడాది (2022-, 23) రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని అందులో భాగంగా ఆన్‌లైన్ ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల్లో భాగంగా పుర సంఘాలు, నగర పాలక సంస్థలు తమ గణాంకాలను ఆన్‌లైన్ లెక్కల తనిఖీ (ఆడిట్) విధానానికి శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఆడిట్ వందశాతం ఆన్‌లైన్ పూర్తవుతున్న నేపథ్యంలో పురపాలక శాఖ పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించింది.

నిధుల వ్యయం పక్కాగా ఉండాలి….

ఈ ఆడిట్‌కు సంబంధించ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు లెక్కలను రూపొందించాలని పురపాలక శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నిధుల వ్యయం పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించింది. పురపాలక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణకు పటిష్టమైన ఆడిట్ లెక్కల అవసరమని పురపాలక శాఖ అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పలు నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు క్రెడిట్ రేటింగ్ పొందాయి. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు, పురపాలక సంఘాల సొంత ఆర్ధిక వనరులు, ఇతర ఫీజులు తదితర రూపాల్లో వస్తున్న రాబడులు, వ్యయాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం భావించింది ఈనేపథ్యంలో ఈసారి నుంచి ఆన్‌లైన్ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. నిధుల వ్యయంలో నిబంధనలు పాటించడం, మార్గదర్శకాలకు అనుగుణంగా వెళ్లేలా చేయడంపై ఇప్పటికే పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలోని…

పట్టణ, స్థానిక సంస్థలు, కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మేరకు గ్రాంట్లను పొందాలంటే విధిగా సంస్థల ప్రాథమిక లెక్కలు, ‘తనిఖీ’ చేసిన లెక్కలను ఆన్‌లైన్ అందుబాటులో ఉంచాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో నిధులు పొందే ముందే అంతకుముందు ఏడాదికి సంబంధించిన ఆడిట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నిబంధన పాటించని స్థానిక సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సూచనలతో పాటు స్వీయ నియంత్రణ విధానంలో రాష్ట్రంలో పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలోని 129 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థలు ఆన్‌లైన్ ఆడిట్‌కు సిద్ధమయ్యాయి.

క్రెడిట్ రేటింగ్ సర్టిఫికెట్

ఇప్పటికే రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వాటి ఆర్థిక స్థితిపై పలు స్వతంత్ర రేటింగ్ సంస్థల నుంచి క్రెడిట్ రేటింగ్ సర్టిఫికెట్ పొందాయి. రానున్న రోజుల్లో మునిసిపాలిటీలు వాటి పరిధిలో అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణను బాండ్ల ద్వారా చేపట్టడానికి ఈ క్రెడిట్ రేటింగ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వాటి వ్యయాలపై ఆడిట్ రిపోర్టును ఆన్‌లైన్‌లో ఉంచగలిగితేనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సులభంగా రుణాలు పొందగలిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మునిసిపాలిటీలు వాటి సొంత వనరులైన ఆస్తి పన్ను, ఇతర ఫీజులు పట్టణ ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి నెల ఇస్తున్న నిధులు, ఆర్థిక సంఘం అందజేస్తున్న గ్రాంట్ల వ్యయం వివరాలు పక్కాగా నిర్వహించడానికి ఆన్‌లైన్ ఆడిటింగ్ చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News