లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ రాజీనామా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తమ పదవికి రాజీనామా చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు ప్రకటించిన బైజల్ తమ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు బుధవారం పంపించారు. ఢిల్లీ కేంద్రంగా బిజెపి ఆప్ మధ్య సాగుతోన్న రాజకీయాల నడుమ బైజల్ రాజీనామా కీలక ఆకస్మిక పరిణామం అయింది. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అయిన ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2016 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందటి ఎల్‌జి నజీబ్ జంగ్ అర్థాంతరంగా రాజీనామాకు దిగడంతో బైజల్ ఈ స్థానం భర్తీ చేశారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, ఢిల్లీలో ఆప్ సర్కారు మధ్య పలు స్థాయిల అధికార తగవులకు లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఎప్పటికప్పుడు కేంద్ర బిందువు అవుతూ వచ్చింది. ఢిల్లీపై పెత్తనం తమదే అని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొనడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా తమదే పైచేయి అని ఆప్ సర్కారు చెపుతూ రావడంతో పలు నిర్ణయాలపై పరస్పరం జగడం నెలకొంటూ వచ్చింది. ఇరువురి అధికార పరిమితులపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినా వివాదాల ముగింపు ప్రక్రియకు వీలుగా నిర్ధేశిత ఆదేశాలు వెలువరించినా ఎప్పుడూ చిలికిచిలికి గాలివాన పరిస్థితులు రగులుకున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ అమలుకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ నిలిపివేయడం వంటి పరిణామాలు అనేకం జరిగాయి.