ఈనెల 31 నుంచి జూన్ 18వరకు ఓపెన్ పది, ఇంటర్‌పరీక్షలు
అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్: విద్యార్థులు సెల్‌పోన్లతో వస్తే వారి సెల్‌పోన్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా పరీక్షలకు అనుమతించడం జరగదని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్ ( టిఓఎస్‌ఎస్) ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలపై గురువారం సంబందిత శాఖల అధికారులలతో తన చాంబర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలోకి విద్యార్థులు ఎవరు సెల్‌పోన్లతో రావద్దని వారిని అనుమతించడం జరగదన్నారు.జిల్లాలో మే 31 నుంచి జూన్ 18వరకు టిఓఎస్‌ఎస్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పరీక్షలను పకడ్బందిగా నిర్వహించాలన్నారు. అన్ని కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పరీక్షల సందర్భంగా ఎలాంటి కాఫీ జరగకుండా విద్యార్థులను తనిఖీ చేయాలని, తీవ్ర వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్ధులకు అవసరమైన త్రాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎఎన్‌ఎం ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 56 కేంద్రాలు, ఇంటర్‌కు 37 కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు, ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 10,617, ఇంటర్‌కు 8, 124 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు, అదే విధంగా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్‌తో పాటు, జీరాక్స్ కేంద్రాలు మూసి ఉండేలా చూడాలన్నారు. ఈసమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.