మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడో వారంలో ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలుడవే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, గురువారంతో ప్రధాన పరీక్షలు ముగిశాయి. ఈనెల 24తో అన్ని ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాకంనం(స్పాట్ వ్యాల్యుయేషన్) ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభం కాగా, ఈనెల 22న ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్లు దిద్దనున్నారు. 26న ఫిజిక్స్, ఎకనామిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పేపర్లు, 28న కెమిస్ట్రీ, కామర్స్, 31న హిస్టరీ, బాటనీ, జూవాలజీ జవాబుపత్రాలను మూల్యాంకనం చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 కేంద్రాలలో జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బోర్డు పరిధిలో 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలు ఉండగా, ఈ సారి కొత్తగా మంచిర్యాల, సిద్ధిపేట, నిర్మల్ జిల్లా కేంద్రాలలో జవాబుపత్రాల మూల్యాంకనం కేంద్రాలు ఏర్పాటు చేశారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో సుమారు 15 వేల మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, కొన్ని ప్రింటింగ్ పొరపాట్లు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎలాంటి తప్పులు జరుగకుండా చూస్తామని చెప్పారు. విద్యారులకు ఏమైనా సందేహాలు ఉంటే 18005999333 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.