గువాహటి : అస్సాంలో భారీ వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్నాయి. 26 జిల్లాల్లోని 1089 గ్రామాలు వరద నీటిలో మునిగినపోవడంతో పాటు అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. వరదలకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వరదల వల్ల కాచర్‌లో ఇద్దరు. ఉదల్‌గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగి పడటంతో డిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒకరు మృతి చెందారు. నాగావ్ జిల్లాలో మరో ఐదుగురు అదృశ్యమయ్యారు. నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. భారీ వర్షాల వల్ల నాగావ్ జిల్లాలో వరద పరిస్థితి మరింత దిగజారింది. కాచర్‌లో 40,000 మంది ప్రజలు వరద విపత్తులతో అల్లాడుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 142 సహాయ శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాటు చేసింది. 39,558 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.