‘కొవిడ్ -19 మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించి రెండేళ్లు. ముఖ్యంగా పిల్లల అభ్యాసానికి భారీ నష్టం సంభవించింది. సగం కంటే తక్కువ దేశాలు పిల్లలను చేరదీసి సహాయపడటానికి లెర్నింగ్ రికవరీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అన్ని దేశాలు రాబోయే నెలల్లో కార్యక్రమాలను అమలు చేసి విస్తరించకపోతే అవి ఒక తరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ‘–స్టెఫానియా జియానిని, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ -యునెస్కో మార్చి 2020 నుండి పాఠశాలల మూసివేత కారణంగా రెండు ట్రిలియన్ గంటలు వ్యక్తిగతంగా పాఠశాల విద్యకు దూరమైంది, ఐదింట నాలుగు దేశాల్లో విద్యార్థులు అభ్యసనంలో వెనుకబడి వున్నారు. తక్కువ ఆర్థిక స్తోమత గల తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసనం తీవ్రంగా నష్టపోవడాన్ని చవిచూశారు. ముఖ్యంగా, అత్యంత అట్టడుగున ఉన్నవారు – పేదరికం, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, వికలాంగ పిల్లలు, బడీడు చిన్నారులు అత్యంత వెనుకబడి పోయారు’ రాబర్ట్ జెంకిన్స్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, యునిసెఫ్.
‘విద్యతో అనుసంధానమైన ప్రతి అంశంలో ప్రాథమిక, మౌలిక నైపుణ్యాలు అనేక దేశాలలో కుంటువడ్డాయి. పిల్లలు చదవడం, రాయడం ఎలాగో మరచిపోయారు; కొందరైతే అక్షరాలనే గుర్తించటం లేదు. చాలా దేశాల్లో బాల్య విద్య కనుమరుగైనందున, తొలిసారిగ పాఠశాలలో అడుగిడడానికి సిద్ధంగా ఉన్న పిల్లలకు భాషా నైపుణ్యాలు అలవరచుకునే అవకాశం లభించలేదు. తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే జీవన పర్యంతం పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు సమస్యాభరితమవుతాయి. భవిష్యదభ్యాసం, ఉపాధి అవకాశాలకు పెను సంక్షోభం ఏర్పడుతుంది’– జైమే సావేద్ర, గ్లోబల్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ -ప్రపంచ బ్యాంకు.
స్టెఫానియా జియానిని, రాంబర్ట్ జెంకిన్స్, జైమే సావేద్ర ముగ్గురూ గత మార్చి 30న సంయుక్త ప్రకటనలో తమ సంస్థల తరఫున అభ్యసన పునరుద్ధరణ (లెర్నింగ్ రికవరీ) ఆవశ్యకత -అమలు గురించి విశ్వవ్యాప్త విద్యాలయాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పెద్దలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తల దాకా అందరినోటా అభ్యసన పునరుద్ధరణ మొదలైతేనే భావితరం కోలుకుంటారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశదేశాల విద్యా శాఖలు అభ్యసన పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. సంభవించిన విద్యానష్టాన్ని భర్తీ చేయడానికి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. లెర్నింగ్ రికవరీని ఏ విధంగా చేపట్టాలన్న విషయంలో ‘క్యాచ్- అప్ లెర్నింగ్’ కార్యక్రమాన్ని కూడా యునెస్కో సూత్రీకరించింది. అయితే ప్రభుత్వాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులు వారి స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని పరస్పర సంబంధం ఉన్న మూడు పునరుద్ధరణ కోణాలను సమన్వయ పరచుకోవాల్సుంది.
1. పాఠ్యాంశాల విధానం. ఉదా: ప్రధాన జ్ఞానం, నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి పాఠ్యాంశాలు నిర్ధారించుకోవాలి; 2. అవసరమైన అదనపు మద్దతు. ఉదా: కష్టపడుతున్న విద్యార్థులకు శిక్షణ; 3. అవలంబించిన విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన ఆచరణాత్మక చర్యలు. ఉదా: వ్యక్తిగతంగా సంప్రదింపు సమయాన్ని పెంచడానికి పాఠశాల క్యాలెండర్, టైమ్‌టేబుల్‌ని సర్దుబాటు చేయడం, తరగతిలోని విద్యార్థులను లఘు సమూహాలు గా విభజించి అభ్యసన పునరుద్ధరణను నిర్వహించడం.ఎంచుకున్న చర్యలను అమలు చేయడంలో పాఠశాల భిన్నమైన పాత్రలు, బాధ్యతలు నిర్వహించడం. పిల్లల సమగ్రాభివృద్ధికి పాఠశాలగా అన్ని పార్శ్వాల్లో కృషి చేయడం.
ఇదే నేపథ్యంలో అభ్యసన పునరుద్ధరణ ఎట్లా ముందుకు సాగాల్సి వుందో, ఏయే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలో, ఏయే అంశాల్లో చొరవ చూపాల్సి వుందో అనే దానికి యునెస్కో, యునిసెఫ్, ప్రపంచ బ్యాంకు మన ముందుంచుతున్న మరికొన్ని అంశాలివి.
1. అమలు చేయబడిన లేదా సర్దుబాటు చేసిన పాఠ్యాంశాల ఆధారంగా నైపుణ్యాలు, జ్ఞాన అంతరాలను నిర్ణయించడం ద్వారా అభ్యాస అవసరాలను అంచనా వేసుకోవాలి. ఇందుకు నిరంతర ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లు రెండూ అవసరం. 2. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా బోధనను మరింత అనుకూలంగా మార్చడానికి బోధనా విధానాన్ని సర్దుబాటు చేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ప్రధాన సూత్రాలు ప్రతిబింబించడానికి, అందుబాటులో ఉన్న పరిమిత సమయంలో అవసరమైన నైపుణ్యాలను బోధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. 3.విద్యా వ్యవస్థకు బోధకులే వెన్నెముక కాబట్టి ఉపాధ్యాయులకు ప్రాధాన్యతనిస్తూ తగిన శిక్షణ, మద్దతు ఇవ్వా లి. తరగతి గదిలోకి కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టే ఏ ప్రయత్నమైనా అడాప్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీలు, లెర్నింగ్ అసెస్‌మెంట్, డిజిటల్ స్కిల్స్‌లో ఉపాధ్యాయులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. 4. విద్యార్థులు, ఉపాధ్యాయుల మానసిక ఆరోగ్య అవసరాలను గుర్తించడం ద్వారా సామాజిక- భావోద్వేగ అభ్యాసాన్ని తప్పక బోధించాలి. క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్‌లు బుద్ధిపూర్వకత, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆరోగ్యకరమైన వ్యక్తిగత సంబంధాలను పెంపొందించే క్రమంలో ఒక కీలకాంశంగా మానసికారోగ్యాన్ని ఏకీకృతం చేయాలి. 5. లింగ సమానత్వాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలి. పిల్లల చేరిక నుంచే లింగ సమానత్వ భావనను నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి తర్వాత పాఠశాలకు తిరిగిరాని 11 మిలియన్ల మంది బాలికలకు, రెండేళ్ల సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఇతర వెనుకబడిన లేదా బడుగు బలహీన వర్గాలనూ కలుపుకోవాలి.
విధాన నిర్ణేతలు పాఠశాలల్లో లింగ వివక్షను తగ్గించాలి, రానున్న రెండు మూడు నెలల్లో వందకు వంద శాతం బాలికలను పాఠశాలలకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించాలి, పునరుద్ధరణ ప్రణాళికలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. తరగతి గది లో, వెలుపల బాలికలకు, నిమ్నవర్గాల వారికి హాని కలిగించే అంశాలను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఉత్తేజకరమైన, ఆహ్లాదకరమైన, ఆస్వాదనీయమైన బోధనా కళ అభ్యసన పునరుద్ధరణకు ఎల్లెడలా తోడ్పడగలదు. అన్నిటికంటే ముందు అభ్యసన పునరుద్ధరణ వాతావరణాన్ని పాఠశాల్లో సమర్థవంతంగా కల్పించడం.
ఇదే సందర్భంలో పిల్లలందరినీ సురక్షితంగా పాఠశాలకు తీసుకురావడంలో ప్రపంచ దేశాలకు మద్దతు ఇవ్వడానికి యునెస్కో యునిసెఫ్ లతో ప్రపంచ బ్యాంకు అనుసంధానం కావడం ఓ శుభపరిణామం. ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అభ్యసన పునరుద్ధరణ కొరకు రూపొందించిన ‘మిషన్: రికవరింగ్ ఎడ్యుకేషన్-2021’ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు కరదీపిక కాగలదు. ‘మిషన్: రికవరింగ్ ఎడ్యుకేషన్-2021’ లో ప్రధానంగా మూడు ప్రాధమ్యాలు పేర్కొనబడ్డాయి.
అవి 1. బాలబాలికలు, యువకులందరూ తిరిగి పాఠశాలలో చేరాలి. వాళ్ల అభ్యాసం, ఆరోగ్యం, మానసిక సాంఘిక శ్రేయస్సు, ఇతర అవసరాలను తీర్చడానికి తగిన సేవలు తక్షణం అందుబాటులో ఉంటాయి. 2. విద్యార్థులు అభ్యాస నష్టాలను పూరించుకోవడంలో సహాయపడటానికి సమర్థవంతమైన పునరుద్ధరణ అభ్యాసాన్ని పొందుతారు. 3. ఉపాధ్యాయులందరూ తమ విద్యార్థులలో అభ్యస నష్టాలను పరిష్కరించడానికి, వారి బోధనను డిజిటల్ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ పునరుద్ధరణ విద్యా కార్యక్రమానికి మద్దతు ఇస్తారు. ఇదే సందర్భంలో యునెస్కో రూపొందించిన ‘కొవిడ్ ఇష్యూ నోట్స్’ ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొవిడ్ నోట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునెస్కో విద్యా సహోద్యోగులు సమిష్టిగా చేశారు. తొమ్మిది నేపథ్య విభాగాల క్రింద అనేక అంశాలను కొవిడ్ ఇష్యూ నోట్స్ పరిగణనలోకి తీసుకుంది. అవి: ఆరోగ్యం- శ్రేయస్సు, అభ్యాసం- బోధన కొనసాగింపు, లింగ సమానత్వం, – సమభాగత్వం, బోధన- అభ్యాసం, ఉన్నత విద్య,- వృత్తి విద్యా శిక్షణ, విద్య- సంస్కృతి; విద్యా విధానం -ప్రణాళిక, బలహీన జనాభా, అలాగే స్థిరమైన అభివృద్ధి కోసం ప్రపంచ పౌరసత్వ విద్య పై అవగాహన ఏర్పరచడం.
ఈ మొత్తం విషయాలను అవగాహనలో ఉంచుకొని దేశంలోనూ రాష్ట్రంలోనూ అభ్యసన పునరుద్ధరణ ప్రణాళిక (లెర్నింగ్ రికవరీ ప్లాన్) పకడ్బందీగా అమలైతే తప్ప బాలల యువతీయువకుల అభ్యస నష్టభర్తీ జరగదు. ఇందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలూ ఉదారంగా ముందుకు రావాల్సుంది. ఈ సంక్షోభ సమయంలో ప్రజారోగ్యం తర్వాత అభ్యసన పునరుద్ధరణే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. జరిగిపోయిన కాలానికి సంబంధించి కోల్పోయిన చదువును తిరిగి అందించడమే అభ్యసన పునరుద్ధరణ ప్రధాన లక్ష్యం.
డా. బెల్లియాదయ్య
9848392690