మనతెలంగాణ/ హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజనలో వివిధ జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు,ఎలుగు బంట్లు. నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. జన్నారం అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీటి కదలికలు నమోదు కావడం, వీటి సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ అధికారులు అంచనా.
కెమెరాల్లో దాదాపు 60 చిత్రాలు ఉండగా, ఇందులో ఎక్కువగా రాత్రివేళ వన్యప్రాణులు సంచరిస్తు న్నవే ఉన్నాయి. ఈ చిత్రాలు అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వైవిధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటవీ జీవవైవిధ్యం పెరిగిందని అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తాజా చిత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి, కేంద్ర పర్యావరణ శాఖకు, ఎన్‌టిసిఎకు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కెటిఆర్, ఎంపి సంతోష్‌కుమార్‌కు ట్యాగ్ చేస్తూ అటవీశాఖ ట్వీట్ చేసింది.
పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికి కవ్వాల్లో పులులు స్థిరనివాసం ఏర్పరచుకోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. కోర్ ’టైగర్ ఏరియాలో కొన్ని గ్రామాల ప్రజలు, వారి పెంపుడు జంతువుల కదలికలు ఉండటంతో పులులు ఇబ్బంది పడుతున్నాయని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వే కారిడార్, ఇతర ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నందున్న.. త్వరలో అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని వారి అంచనా.
అటవీ ప్రాంతాల్లో బాధ్యతగా ప్రయాణించాలి…
అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని రహదారిపై మచ్చల పిల్లి రోడ్డుపై గురువారం రాత్రి మృత్యువాత పడింది. వన్యప్రాణులు సంచరించే ప్రాంతంలోని రహదారులపై వాహనదారులు బాధ్యతగా ప్రయాణించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.