దో తరగతి పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం
ఆర్టీసి ఎండి సజ్జనార్ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి ఎండి కల్పించారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐపిఎస్ అధికారి సజ్జనార్ వినూత్న నిర్ణయాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఆర్టీసిని దగ్గర చేయాలన్న సంకల్పంతో ఆయన ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పండుగలు, సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో బస్సు ప్రయాణానికి రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంటున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రయాణికుల నుంచి అందే విజ్ఞప్తులు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 23 నుంచి జరిగే టెన్త్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఆర్టీసి ఎండి సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆయన నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. విద్యార్థులు ప్రస్తుతం కలిగి ఉన్న బస్‌పాస్ గడువు పొడిగింపును జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.