గతవారం 1089 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతవారం చూస్తే ఒక రోజు భారీ నష్టాలు, మరో రోజు భారీ లాభాలు వంటి పరిస్థితులు కనిపించాయి. గతవారం మొత్తంగా చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 1089 పాయింట్లు కోల్పోయింది. సోమవారం సెన్సెక్స్ 53,302 పాయింట్లు వద్ద ప్రారంభమై, వారాంతం శుక్రవారం 54,391 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం భారీగా పతనమైన సెన్సెక్స్ 1400 పాయింట్లతో భారీగా పతనమైంది. అంతే రీతిలో శుక్రవారం సెన్సెక్స్ భారీగా 1,534 పాయింట్లు లాభపడింది. 2.91 శాతం లాభంతో ఆఖరికి 54,326 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.5.05 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.254.11 లక్షల కోట్లకు పెరిగింది. మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు 2.20 శాతం, 2.51 శాతం చొప్పున పెరిగాయి.
మొత్తం 15 రంగాలు కూడా గ్రీన్‌మార్క్‌లో కనిపించాయి. మెటల్, ఫార్మా అద్భుత లాభాలను చూశాయి. మరోవైపు రెడ్డీస్ ల్యాబ్ షేరు 7.60 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్, జెఎస్‌డబ్లు స్టీల్, టాటా మోటార్స్ కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. మొత్తంగా చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్‌పై 2,497 షేర్లు లాభపడగా, 777 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ అన్ని కూడా లాభాలతో ముగిశాయి. వీటిలో డా.రెడ్డీస్, రిలయన్స్, టాటా స్టీల్, నెస్లె, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్‌బిఐ వంటివి ఉన్నాయి. గురువారం ఒక్క రోజే పెట్టుబడిదారులు రూ. 7 లక్షల కోట్లు కోల్పోయారు. గ్లోబల్‌గా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లో పెట్టుబడిదారులు అత్యధికంగా లాభాల స్వీకరణ చేపట్టారు.
యుఎస్ మార్కెట్లు భారీపతనం అవుతున్నాయి. దీంతో భారతీయ స్టాక్‌మార్కెట్లు కూడా కుప్పకూలాయి. మరోవైపు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుండి భారీ అమ్మకాలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ కీలక మార్క్ 53,000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,000 దిగువన ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,416 పాయింట్లు నష్టపోయి 52,792 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 430 పాయింట్లు కోల్పోయి 15,809 పాయింట్ల వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే అన్ని సెక్టార్లలో నష్టాలు కనిపించాయి. బ్యాంక్ నిఫ్టీ 2.48 శాతం అంటే 846 పాయింట్లు పతనమై 33,318 పాయింట్ల వద్ద ముగిసింది.